Telangana: తెలంగాణలో ముందస్తు ఎన్నికలు ఉండవు.. షెడ్యూల్ ప్రకారమే అసెంబ్లీ ఎన్నికలు: కేసీఆర్
- టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, పార్టీ కీలక నేతలతో కేసీఆర్ విస్తృత స్థాయి సమావేశం
- 3 గంటల పాటు కొనసాగిన భేటీ
- బీజేపీతో పోరాటమేనన్న కేసీఆర్
- సిట్టింగులను మార్చే ప్రసక్తే లేదని వెల్లడి
- అనవసర విషయాల జోలికి వెళ్లరాదని పార్టీ నేతలకు సూచన
తెలంగాణలో ముందస్తు ఎన్నికలపై జరుగుతున్న ప్రచారంపై టీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కొట్టిపారేశారు. ఈ మేరకు మంగళవారం నిర్వహించిన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ప్రసంగించిన కేసీఆర్ కీలక ప్రకటనలు చేశారు. షెడ్యూల్ ప్రకారమే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ఆయన తేల్చి చెప్పారు. అంతేకాకుండా సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చే ప్రసక్తి లేదని కూడా ఆయన వెల్లడించారు. ఆయా నియోజకవర్గాల్లో పాత వారికే సీట్లు కేటాయిస్తామని కూడా ఆయన ప్రకటించారు.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. ఎంపీలు, పార్టీ కీలక నేతలతో కలిసి మంగళవారం కేసీఆర్ ఓ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. 3 గంటల పాటు జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 10 నెలల సమయం మాత్రమే ఉందని పార్టీ శ్రేణులకు సూచించారు. నేతలంతా పార్టీ విజయానికి గట్టిగా కృషి చేయాలని ఆయన సూచించారు. అనవసర విషయాల జోలికి వెళ్లరాదన్నారు. ఐటీ, ఈడీ దాడులతో విరుచుకుపడుతున్న బీజేపీపై పోరాటం కొనసాగించాల్సిందేనని ఆయన పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. బీజేపీతో ఇక యుద్ధమేనని కూడా ఆయన ప్రకటించారు.