Vangalapudi Anitha: ‘సైకో’ పాలన పోయి ‘సైకిల్’ పాలన రావాలి: తెలుగు మహిళ అధ్యక్షురాలు అనిత
- 'మాటామంతి' పోస్టర్ ఆవిష్కరించిన తెలుగు మహిళ అధ్యక్షురాలు
- జగన్ ను నమ్మి ఓటేసి మహిళా వర్గం మోసపోయిందని వ్యాఖ్య
- జగన్ ధనదాహానికి మహిళల తాళిబొట్లు తెగుతున్నాయని ఆగ్రహం
రాష్ట్రంలో ‘సైకో’ పాలన పోయి ‘సైకిల్’ పాలన రావాలని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత పేర్కొన్నారు. మంగళవారం తెలుగు మహిళా ఆధ్వర్యంలో 'మాటామంతి' కార్యక్రమం పోస్టర్ ను అనిత, తెలుగు మహిళ విభాగం నేతలు ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా అనిత మాట్లాడుతూ, రాష్ట్రంలో జగన్ ను నమ్మి ఓటేసి మహిళా వర్గం మోసపోయిందని అన్నారు. జగన్ ధన దాహానికి మహిళల తాళిబొట్లు తెగుతున్నాయని వ్యాఖ్యానించారు.
"ఎన్నికలకు ముందు రాష్ట్రంలో మద్యాన్ని అరికడతానని ప్రగల్భాలు పలికిన జగన్మోహన్ రెడ్డి మహిళలను నమ్మించి మోసం చేశాడు. అమ్మఒడి, ఆసరా, 45 సంవత్సరాలకే పెన్షన్ ఇస్తారని మహిళలు జగన్ కు ఓట్లు వేయలేదు. కేవలం సంపూర్ణ మద్యపాన నిషేధం విధిస్తామని చెబితేనే ఓట్లేశారు.
జగన్మోహన్ రెడ్డిని ఎన్నికలకు ముందు ఎక్కువగా ఆదరించింది మహిళలే. ప్రస్తుతం మహిళలను టార్గెట్ చేసి హింసిస్తున్నారు. రాష్ట్రంలో పూటకో అత్యాచారం జరుగుతుంటే దిశ చట్టం ఏమైంది? మహిళా కమిషన్ కు అత్యాచారాలు, హత్యలు జరిగిన వివరాల బుక్ ను ఇచ్చాం. క్లియర్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా మహిళా కమిషన్ లో చలనం లేదు. జగన్ ను, ఆయన సతీమణిని ఎవరైనా ఏమైనా అంటే డీజీపీ... మహిళా కమిషన్ కార్యాలయం మెట్లెక్కి ఫిర్యాదు చేస్తారు.
అనేకమంది జే బ్రాండ్స్, గంజాయి, డ్రగ్స్ కు అలవాటు పడ్డారు. ఉమ్మడి కర్నూలు జిల్లా ఎమ్మగనూరు నియోజకవర్గంలో ఒక వ్యక్తి తన తల్లిపైనే అఘాయిత్యం చేయబోయాడు. తాగిన మత్తులో తల్లికి, చెల్లికి, ముసలివాళ్లకి, వికలాంగురాలికి కూడా తేడా లేకుండా వీరు పైశాచిక ఆనందం పొందుతున్నారు. అనూష, తేజస్విని, శ్రీలక్ష్మి, రమ్య, స్నేహలతలు చంపబడితే దిక్కులేదు.
మద్య నిషేధం అని చెప్పిన వైసీపీ నేతలు ఎన్ని బేవరేజెస్ లను, ఎన్ని డిస్టలరీలను మూయించారో చెప్పాలి. రాష్ట్రంలో కరోనాతో చనిపోయిన వారి సంఖ్యతో పోలిస్తే కల్తీ మద్యం బారిన పడి చనిపోయిన వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. వైసీపీ నాయకులు గడప గడపకు కార్యక్రమానికి వెళ్లినప్పుడు మహిళలు అడిగితే ఏం సమాధానం చెబుతారు?
రాష్ట్రంలో ధరలు విపరీతంగా పెరిగాయి. జగన్ కు ధన పిశాచి ఆవహించిందా అనే అనుమానం కలుగుతోంది. రాష్ట్ర ఖజనాకు చేరే ఆదాయం కన్నా తాడేపల్లి ప్యాలెస్ కు చేరే ఆదాయం ఎక్కువ.
దీనిపై గ్రామ గ్రామానికి వెళ్లి 'మాటామంతి' కార్యక్రమం ద్వారా మహిళలను చైతన్యపరుస్తాం. చంద్రబాబు హయాంలో మహిళలు ఎలా ఉన్నారు, జగన్ ప్రభుత్వ హయాంలో మహిళలు ఎలా ఉన్నారు? అనే విషయాలను ప్రతి ఒక్కరూ గ్రహించాలి" అని పిలుపునిచ్చారు.