Arjun Tendulkar: ముంబయి ఇండియన్స్ లో స్థానం నిలుపుకున్న సచిన్ తనయుడు
- ఐపీఎల్ ఫ్రాంచైజీల మధ్య ఆటగాళ్ల మార్పిడి
- ఆటగాళ్ల విడుదలకు ముగిసిన గడువు
- పలువురు ఆటగాళ్లను వదిలించుకున్న ముంబయి
- కీరన్ పొలార్డ్ కు వీడ్కోలు
- అర్జున్ టెండూల్కర్ ను అట్టిపెట్టుకున్న వైనం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంచైజీల మధ్య ఆటగాళ్ల పరస్పర మార్పిడి, ఆటగాళ్ల విడుదలపై నేటితో గడువు ముగిసింది. ఐపీఎల్ లో దిగ్గజ జట్టుగా పేరుగాంచిన ముంబయి ఇండియన్స్ ఈ క్రమంలో నేడు అత్యంత కీలక నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. తమ ఫ్రాంచైజీతో 13 ఏళ్ల సుదీర్ఘ అనుబంధం కలిగిన వెస్టిండీస్ ఆల్ రౌండర్ కీరన్ పొలార్డ్ ను ముంబయి జట్టు రిలీజ్ చేసింది. ఈ నిర్ణయం నేపథ్యంలో కీరన్ పొలార్డ్ ఐపీఎల్ కు వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించాడు.
ఆటగాడిగా వైదొలగిన పొలార్డ్ 2023 ఐపీఎల్ సీజన్ లో ముంబయి ఇండియన్స్ కు బ్యాటింగ్ కోచ్ గా వచ్చే అవకాశాలు ఉన్నాయి. అదే సమయంలో, యూఏఈ టీ20 లీగ్ లో ముంబయి ఎమిరేట్స్ జట్టులో పొలార్డ్ ఆడనున్నాడు. ముంబయి ఎమిరేట్స్ ఫ్రాంచైజీ ముంబయి ఇండియన్స్ కు అనుబంధ సంస్థ!
ఇక అసలు విషయానికొస్తే... గత ఐపీఎల్ సీజన్ లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని సచిన్ టెండూల్కర్ తనయుడు అర్జున్ టెండూల్కర్ ముంబయి ఇండియన్స్ జట్టులో తన స్థానం నిలుపుకోవడం విశేషం. పలువురు అంతర్జాతీయ ఆటగాళ్లను వదిలించుకున్న ముంబయి ఫ్రాంచైజీ అర్జున్ టెండూల్కర్ ను మాత్రం అట్టిపెట్టుకుంది. మరి, వచ్చే సీజన్ లో అయినా అతడికి అవకాశం వస్తుందా అన్నది సందేహాస్పదమే.
రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, టిమ్ డేవిడ్, జోఫ్రా ఆర్చర్, ట్రిస్టాన్ స్టబ్స్, డివాల్డ్ బ్రేవిస్, రమణ్ దీప్ సింగ్, తిలక్ వర్మ, ఇషాన్ కిషన్, ఆకాశ్ మధ్వాల్, హృతిక్ షోకీన్, అర్షద్ ఖాన్, అర్జున్ టెండూల్కర్, కుమార్ కార్తికేయ, జాసన్ బెహ్రెండార్ఫ్.