Balakrishna: బాలయ్య 'అన్ స్టాపబుల్' షో గెస్టులుగా కిరణ్ కుమార్ రెడ్డి, సురేశ్ రెడ్డి

nallari kiran kumar reddy and kr suresh reddy are the guests fo balakrishna unstoppable show
  • ఈ నెల 18 నుంచి ప్రసారం కానున్న అన్ స్టాపబుల్ 4వ ఎపిసోడ్
  • తాజా ఎపిసోడ్ షూటింగ్ ఇప్పటికే పూర్తి  
  • ఎపిసోడ్ ఫొటోలను విడుదల చేసిన ఆహా  
టాలీవుడ్ అగ్ర నటుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అన్ స్టాపబుల్ షోకు గెస్టులుగా మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కేఆర్ సురేశ్ రెడ్డిలు హాజరు కానున్నారు. బాలయ్య హోస్ట్ గా ఆహా ఓటీటీ వేదికగా అన్ స్టాపబుల్ పేరిట ఓ కార్యక్రమం ప్రసారం అవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే తొలి సీజన్ ముగించుకున్న ఈ షో... ఇటీవలే తన సెకండ్ సీజన్ ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. సెకండ్ సీజన్ తొలి ఎపిసోడ్ కు టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు, ఆయన కుమారుడు నారా లోకేశ్ హాజరైన సంగతి తెలిసిందే.

తాజాగా ప్రసారం కానున్న 4వ ఎపిసోడ్ లో కిరణ్ కుమార్ రెడ్డి, సురేశ్ రెడ్డిలు అతిథులుగా హాజరు కానున్నారు. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే పూర్తి కాగా... ఈ ఎపిసోడ్ ఫొటోలను ఆహా మంగళవారం రాత్రి విడుదల చేసింది. ఈ షో ఈ నెల 18 నుంచి ప్రసారం కానుంది. రాష్ట్ర విభజనకు ముందు కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలుగా కిరణ్ కుమార్ రెడ్డి, సురేశ్ రెడ్డిలు కొనసాగిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డికి అత్యంత సన్నిహితులుగా ముద్ర పడ్డారు.

ఉమ్మడి రాష్ట్రానికి చివరి సీఎంగా కిరణ్ కుమార్ రెడ్డి రికార్డుల్లోకి ఎక్కిన సంగతి విదితమే. అలాగే ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీకి సురేశ్ రెడ్డి స్పీకర్ గా వ్యవహరించారు. వైఎస్ సీఎంగా ఉన్న సమయంలో కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్ గా వ్యవహరించారు. వైఎస్సార్ మరణం తర్వాత ఏడాది పాటు రోశయ్య సీఎంగా ఉన్న సమయంలోనూ కిరణ్ కుమార్ రెడ్డి స్పీకర్ గానే వ్యవహరించారు. ఇక రాష్ట్ర విభజన తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ ను వీడిన సురేశ్ రెడ్డి టీఆర్ఎస్ లో చేరి ప్రస్తుతం రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నారు. సొంత పార్టీ పెట్టిన కిరణ్ కుమార్ రెడ్డి ఆమధ్య తిరిగి కాంగ్రెస్ గూటికి చేరారు.
Balakrishna
Unstoppable
Aha
Nallari Kiran Kumar Reddy
KR Suresh Reddy

More Telugu News