Tdp: ఆక్వా రైతులను ఆదుకొమ్మంటే అక్రమ కేసులా?.. సీఎం జగన్ ను నిలదీసిన అచ్చెన్నాయుడు
- తక్షణమే కేసులు ఉపసంహరించుకోవాలని డిమాండ్
- ఆక్వాకు మద్ధతు ధర కుదించడం జగన్ రెడ్డి అసమర్థతేనని విమర్శ
- చంద్రబాబు హయాంలో ఆక్వా రంగంలో రాష్ట్రం అగ్రస్థానంలో ఉందని గుర్తు చేసిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు
ఆక్వా రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ శాంతియుతంగా నిరసన చేస్తున్న తెలుగుదేశం పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టడమేంటని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అచ్చెన్నాయుడు ప్రభుత్వంపై మండిపడ్డారు. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆక్వా రైతులను వెంటనే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతుల కష్టాలను ప్రభుత్వం దృష్టికి తెచ్చిన టీడీపీ లీడర్లపై అక్రమ కేసులు నమోదు చేయడాన్ని అచ్చెన్నాయుడు ఖండించారు.
పశ్చిమ గోదావరి జిల్లా ఉండిలో టీడీపీ నేతలు నిమ్మల రామానాయుడు, మంతెన రామరాజు, వెంకట శివరామరాజు, ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు మరో 400 మందిపై నమోదు చేసిన అక్రమ కేసులను తక్షణమే ఉపసంహరించుకోవాలని ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని డిమాండ్ చేశారు.
ఆక్వాకు మద్దతు ధరపై మంత్రుల కమిటీ మొదట నిర్ణయించిన మొత్తం రూ.240 లను రూ.210 లకు తగ్గించడం ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అసమర్ధతకు నిదర్శనమని అచ్చెన్నాయుడు తీవ్రంగా విమర్శించారు. దీనిపై శాంతియుతంగా పోరాడుతున్న టీడీపీ నేతలను అక్రమ కేసులతో ఇబ్బందులకు గురిచేయడం ప్రభుత్వం అనుసరిస్తున్న అప్రజాస్వామిక విధానాలకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్ లో ఆక్వా రంగం దేశంలోనే అగ్రభాగాన ఉందని అచ్చెన్నాయుడు గుర్తుచేశారు. జగన్ రెడ్డి పాలనలో ప్రస్తుతం ఆక్వా రంగం పతనావస్థకు చేరిందని ఆవేదన వ్యక్తం చేశారు. నష్టాలను భరించలేక, మద్దతు ధర లభించక ఆక్వా రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని తెలిపారు. షరతుల పేరుతో సబ్సీడీలు ఎత్తివేసి, జే ట్యాక్స్ తో ఆక్వా రైతులను దోచుకుంటున్నారని ఆరోపించారు. ఇదేమని ప్రశ్నించిన వారిని అణచివేయాలనే జగన్ రెడ్డి కుట్రలు సాగబోవని అచ్చెన్నాయుడు హెచ్చరించారు. ఈమేరకు ఆయన బుధవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు.