Krishna: ఆ ఒక్క డైలాగ్ కృష్ణగారికి మమ్మల్ని దగ్గర చేసింది: పరుచూరి గోపాలకృష్ణ

Paruchuri Palukulu

  • కృష్ణతో అనుబంధాన్ని గుర్తుచేసుకున్న పరుచూరి 
  • ఆయన మనసు బంగారమంటూ వ్యాఖ్య  
  • తమకి వరుస సినిమాలు ఇస్తూ వెళ్లారని వెల్లడి  
  • తమతో ఎక్కువ సినిమాలు రాయించిన హీరో అంటూ వివరణ  
  • ఇండస్ట్రీలో ఆయన సాయాన్ని పొందినవారే ఎక్కువని స్పష్టీకరణ

ఘట్టమనేని కృష్ణ ఈ లోకాన్ని విడిచి వెళ్లడంతో ఆయన అభిమానులంతా తీవ్రమైన ఆవేదనకి లోనయ్యారు. ఎంతోమంది సినీ ప్రముఖులు ఆయనతో తమకి గల అనుబంధాన్ని గుర్తుచేసుకుంటున్నారు. తాజాగా 'పరుచూరి పలుకులు' ద్వారా కృష్ణతో తమకి గల అనుబంధాన్ని గురించి పరుచూరి గోపాలకృష్ణ ప్రస్తావించారు. "దర్శకుడు పీసీ రెడ్డి గారి ద్వారా మాకు కృష్ణగారితో పరిచయమైంది. 'బంగారు భూమి' సినిమాకి మోదుకూరి జాన్సన్ రచయితగా ఉన్నారు. ఆయన అందుబాటులో లేని కారణంగా మేము కొన్ని సీన్స్ రాశాము" అన్నారు. 

ఆ సినిమాలోని ఒక సీన్ లో 'పద్మా .. మనిషిని నమ్మితే మన నోట్లో ఇంత మట్టి కొడతాడు .. మట్టిని నమ్మితే మన నోట్లో ఇంత ముద్ద పెడుతుంది .. ఆ మట్టికి నమస్కారం చేయి' అనే డైలాగ్ రాశాము. ఆ డైలాగ్ చెప్పిన కృష్ణగారు, అది ఎవరు రాశారని అడిగారట. ఆ డైలాగ్ రాసింది మేమని తెలిసి వరుస సినిమాలు ఇస్తూ వెళ్లారు. తన ప్రతి సినిమాకి రాయమని ముందుగా మా దగ్గరికే ఆయన పంపించేవారు. ఆయన హీరోగా చేసిన 54 సినిమాలకి మేము పనిచేశాము. మాతో ఎక్కువ సినిమాలకి రాయించిన హీరో ఆయన" అని చెప్పారు. 

" కృష్ణగారి మనసు బంగారం .. ఇండస్ట్రీలో ఆయన సాయం పొందని వారు అతి తక్కువమంది అనే చెప్పాలి. నేను సొంత ఇల్లు కట్టడం మొదలు పెట్టిన తరువాత డబ్బులు సరిపోక ఆగిపోయినప్పుడు, ఆ విషయం తెలిసి డబ్బు పంపిన విశాలమైన హృదయం ఆయన సొంతం. ఇలా ఎంతమందికి కృష్ణగారు సాయం చేశారన్నది ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. ఎన్ని సినిమాలతో మేము బిజీగా ఉన్నప్పటికీ కృష్ణగారు పంపించారంటే కాదనేవాళ్లం కాదు. అది ఆయన పట్ల మాకు గల అభిమానం .. గౌరవం" అంటూ చెప్పుకొచ్చారు.

  • Loading...

More Telugu News