Sperm count: పురుషుల్లో పడిపోతున్న వీర్య కణాలు... కొత్త అధ్యయనంలో వెల్లడి

Sperm counts are decreasing study finds What might it mean for fertility
  • 2000-2018 మధ్య ఏటా 2.6 శాతం క్షీణత
  • ఇలానే తగ్గిపోతే సంతానం కోసం తప్పని నిరీక్షణ
  • జీవనశైలి, ఆహారంలో వచ్చిన మార్పుల ప్రభావం
  • పోషకాహారం, ఒత్తిడి లేని జీవనం ముఖ్యం
ప్రపంచవ్యాప్తంగా పురుషుల్లో వీర్యకణాల ఉత్పత్తి పడిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. వీర్యకణాల సంఖ్యలోనే కాకుండా, వీర్యకణాల కాన్సంట్రేషన్ (గాఢత) కూడా క్షీణిస్తున్నట్టు తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. 

1973 నుంచి 2000 మధ్య పురుషుల్లో వీర్య కణాల సంఖ్య ఏడాదికి 1.2 శాతం మేర తగ్గగా... 2000 నుంచి 2018 మధ్య ఏడాదికి 2.6 శాతం (రెట్టింపు) క్షీణంచినట్టు అధ్యయనానికి ముఖ్య పరిశోధకుడిగా వ్యవహరించిన హాగీ లెవెనే తెలిపారు. ఇలా వీర్యకణాల సంఖ్య తగ్గిపోతే, పిల్లలు పుట్టేందుకు చాలా కాలం పాటు నిరీక్షించాల్సిన పరిస్థితులు ఎదురవుతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఈ అధ్యయనంలో భాగంగా శాస్త్రవేత్తలు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లోని 250 అధ్యయనాల సమాచారాన్ని క్రోడీకరించి తాజా ఫలితాలను వెల్లడించారు. గత ఐదు దశాబ్దాల కాలంలో ఒక మిల్లీ లీటర్ వీర్యంలో వీర్య కణాల సంఖ్య 104 మిలియన్ల నుంచి 49 మిలియన్లకు తగ్గినట్టు గుర్తించారు.

‘‘నేడు చోటుచేసుకుంటున్న ఎన్నో మార్పులను కాదనలేం. జీవనశైలి, ఆహార నమూనాలు మారిపోయాయి. ఈ మార్పుల ఫలితంగా వీర్యకణాల సాంద్రత తగ్గిపోవడాన్ని చూస్తున్నాం’’అని యూనివర్సిటీ ఆఫ్ ఐవా రీప్రొడక్టవిటీ ఫిజియాలజిస్ట్ అమీ స్పార్క్స్ పేర్కొన్నారు. దీన్ని సీరియస్ గానే తీసుకోవాలని నిపుణులు అంటున్నారు.

కారణాలు
మానవ తయారీ రసాయనాల ప్రభావాలకు గురికావడం, ఒత్తిళ్లు, సరైన ఆహారం తీసుకోకపోవడం, శారీరక చర్యలు లోపించడం, పొగతాగడం, స్థూలకాయం ఇవన్నీ వీర్యకణాలను తగ్గిస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. అధిక బరువు వల్ల హార్మోన్లలో మార్పులు వస్తాయని, పురుషుల శరీరాల్లో మరింత ఈస్ట్రోజన్ చేరుతుందని చెబుతున్నారు. పురుషుల పునరుత్పాదక అవయవాల్లో అధిక కొవ్వు ఉండడం వల్ల అక్కడ వేడి పెరిగి, అది వీర్య కణాల ఉత్పత్తిపై ప్రభావం చూపిస్తుందట. అందుకే సంతానం కలగని దంపతుల్లో పురుషులను బిగుతైన లోదుస్తులు ధరించొద్దని వైద్యులు సూచిస్తుంటారు. 

పరిష్కారాలు
వీర్యకణాల ఉత్పత్తి తగ్గిపోకుండా ఉండాలంటే పోషకాహారం తీసుకోవాలి. శారీరక వ్యాయామాన్ని రోజువారీ జీవనంలో భాగం చేసుకోవాలి. మద్యం, పొగతాగడానికి దూరంగా ఉండాలి. బిగుతైన లో దుస్తులు ధరించకూడదు. ముఖ్యంగా కింది భాగంలో వేడి పెరగకుండా చూసుకోవాలి.
Sperm count
decreasing
affect fertility
new study

More Telugu News