Thammareddy Bhardwaja: ఆ సినిమా నా వల్లనే పోయిందని ఒప్పుకుంటాను: తమ్మారెడ్డి భరద్వాజ
- ఆ సినిమా కథలు చాలా మంచివి
- ఎందుకు ఫ్లాప్ అయ్యాయో తెలియదు
- ఈ సినిమా ఫ్లాప్ కి కారణం నేనే
- ఇండస్ట్రీలో కావాల్సింది సక్సెస్ మాత్రమే
ఇండస్ట్రీలో దర్శక నిర్మాతగా తమ్మారెడ్డి భరద్వాజకి మంచి పేరు ఉంది. ఆయన నుంచి వచ్చిన సినిమాల్లో 'రామ్మా చిలకమ్మా' ఒకటి. సుమంత్ - లయ జంటగా నటించిన ఈ సినిమాకి, ఆయన దర్శకత్వం వహించాడు. అయితే ఆ సినిమా పరాజయం పాలైంది. ఆ సినిమాను గురించి ఒక యూట్యూబ్ ఛానల్లో తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ .. "సుమంత్ బాగుంటాడు .. నాగార్జున కూడా పది ఫ్లాపుల తరువాత సూపర్ స్టార్ అయ్యాడు. అందువలన సుమంత్ తో ట్రై చేయవచ్చని చేసిన సినిమా అది.
'రామ్మా చిలకమ్మా' .. 'స్వర్ణముఖి' .. ' ఊర్మిళ' ఈ మూడు సినిమాలు కూడా నా మనసుకు దగ్గరగా ఉన్నవే. కానీ మూడు సినిమాలు కూడా బాగా ఆడలేదు. కాకపోతే ఇప్పటికీ మళ్లీ తీయదగిన కథ వాటిలో ఉంది. 'ఎంతబాగుందో' సినిమా విషయానికి వస్తే, ఆ సినిమాకి వక్కంతం వంశీ కథను అందించాడు. మంచి పాయింట్ ఉన్న కథ అది. ఆ సినిమా పరాజయంపాలు కావడంలో ఎవరి తప్పు లేదు. డైరెక్టర్ గా నేను కాకుండా వేరే వారు ఉన్నట్టయితే మంచి సినిమా అయ్యుండేది.
ఆ సినిమాను నేను మిస్ హ్యాండిల్ చేశాను. నా వల్ల సినిమా పోయిందని అనుకునే సినిమాల్లో అది ఒకటిగా చెబుతాను. మిగతా సినిమాలు ఎందుకు ఫ్లాప్ అయ్యాయో అడిగితే నేను చెప్పలేనుగానీ, ఈ సినిమా మాత్రం నా మిస్ హ్యాండిలింగ్ వల్లనే పోయిందని ఒప్పుకుంటాను. ఇక ఇక్కడ సక్సెస్ వస్తే చేసిన తప్పులన్నీ దాంట్లో కొట్టుకుపోతాయి. ఫ్లాప్ వస్తే తప్పులను గురించి మాత్రమే మాట్లాడుకుంటారు" అన్నారు.