Krishna: హ్యాటు పెట్టి గన్ను పట్టినా .. తలపాగా చుట్టి నాగలి పట్టినా కృష్ణ తరువాతనే!

krishna Special

  • తెలుగు తెరపై కృష్ణ ప్రయాణం ప్రత్యేకం 
  • మాస్ యాక్షన్ సినిమాలపై మోజు
  • పల్లె కథలపై ఎక్కువ ఆసక్తి
  • ఎప్పటికీ ఆయనను గుర్తుచేసే ప్రత్యేక పాత్రలు

కృష్ణ తెలుగు తెరపై అందగాడు... ఆజానుబాహుడు. ఆయన కనుముక్కుతీరు కారణంగా ఏ పాత్రలోనైనా బాగా సెట్ అయ్యేవారు. పౌరాణికాలలో ఎన్టీఆర్ కి ఒక ప్రత్యేకత ఉంది. రొమాంటిక్ సినిమాల్లో ఏఎన్నార్ కి ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అలాగే జానపదాల విషయానికి వచ్చేసరికి అందరూ కాంతారావును గురించి చెప్పుకునేవారు. కృష్ణ ఆకర్షణీయమైన రూపం ఈ మూడింటికీ సెట్ అవుతుంది. అయినా ఆయన ఆ జోనర్లను అప్పుడప్పుడు మాత్రమే టచ్ చేస్తూ తన ముచ్చట తీర్చుకున్నారు. 

కృష్ణ ఎక్కువగా మాస్ యాక్షన్ సినిమాల దిశగా .. గ్రామీణ నేపథ్యంలోని ఫ్యామిలీ డ్రామాకు ప్రాధాన్యతనిస్తూ వెళ్లారు. సీక్రెట్ ఏజెంట్ తరహా పాత్రల పట్లనే ఆయన ఎక్కువ ఆసక్తిని చూపించారు. కృష్ణ హ్యాటు పెట్టి .. గన్ను చేతిలో పట్టుకుని కౌబోయ్ వేషం కట్టాడంటే ఆ సినిమాలకి వసూళ్ల వర్షం కురిసేది. ఇక ఆ తరహా పాత్రలలో గుర్రాలపై ఛేజింగులు .. కాల్పుల సీన్లను ఆడియన్స్ ఒక రేంజ్ లో ఎంజాయ్ చేశారు. అప్పటివరకూ జానపదాలలో .. చారిత్రకాలలో మాత్రమే గుర్రాలను వాడారు. సాంఘిక చిత్రాలలో గుర్రాలను ఉపయోగించడమనేది కృష్ణతోనే మొదలైంది.

ఇక గ్రామీణ నేపథ్యంలో రైతు బిడ్డగా కృష్ణ అనేక చిత్రాలలో నటించారు. తలపాగా చుట్టి .. నాగలి పట్టే పాత్రలలో ఆయన సాధారణ ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. పొలానికి వెళ్లొచ్చి బావి దగ్గర కాళ్లు కడుక్కొచ్చి .. చేతులను టవల్ తో తుడుచుకుంటూ .. పీటపై కూర్చుని భోజనం చేసే సీన్స్ ను ఆయనంత నేచురల్ గా ఎవరూ చేయలేరని అంటూ ఉంటారు. పల్లె కథలను ప్రోత్సహించడం వల్లనే కృష్ణ సినిమాలు సంక్రాంతి బరిలో తప్పనిసరిగా కనిపించేవి. ఇక 'అల్లూరి సీతారామరాజు' .. 'ఏకలవ్యుడు' .. 'శివాజీ' వంటి ప్రత్యేకమైన పాత్రలపై కూడా ఆయన తనదైన ముద్రవేశారు.

  • Loading...

More Telugu News