Narendra Modi: ఇటలీ ప్రధానికి 'డబుల్ ఇకాత్ దుపట్టా' బహూకరించిన మోదీ
- ఇండోనేషియాలో జీ20 శిఖరాగ్ర సమావేశాలు
- వరుస సమావేశాలతో మోదీ బిజీ
- ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీతో సమావేశం
- మోదీ నుంచి స్కార్ఫ్ అందుకుని మురిసిపోయిన మెలోనీ
ఇండోనేషియాలో జీ20 దేశాల సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ వివిధ దేశాధినేతలతో సమావేశాలు జరుపుతూ బిజీగా గడుపుతున్నారు. ఈ సందర్భంగా ఆయన ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీకి విశిష్టమైన కానుక ఇచ్చారు. ఎంతో నైపుణ్యంతో రూపొందించిన 'పటాన్ పటోలా దుపట్టా'ను ఆమెకు బహూకరించారు. భారత్ నేతన్నల పనితనానికి మచ్చుతునకలా నిలిచే ఈ స్కార్ఫ్ అందుకున్న మెలోనీ మురిసిపోయారు.
ఈ దుపట్టాను ఉత్తర గుజరాత్ లోని పటాన్ ప్రాంతంలో నివసించే సాల్వీ కుటుంబం రూపొందించింది. 'డబుల్ ఇకాత్' పద్ధతిలో రూపుదిద్దుకున్న ఈ దుపట్టా వివిధ రంగులతో ఆకర్షణీయంగా ఉంది. ఈ దుపట్టా రెండు వైపులా ఒకేలా ఉంటుంది. ఏది ముందు భాగం, ఏది వెనుక భాగం అనేది తెలుసుకోలేనంత గొప్పగా తీర్చిదిద్దారు.
కాగా, ఈ సమావేశంలో ఇరుదేశాల సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా వివిధ రంగాలకు చెందిన అంశాలపై మోదీ, మెలోనీ చర్చించారు. వాణిజ్యం, శక్తి, రక్షణ, ఉగ్రవాదం తదితర అంశాలు ఈ భేటీలో చర్చకు వచ్చాయి.