New Delhi: ప్రయాణికుడితో అనర్గళంగా సంస్కృతంలో మాట్లాడిన కారు డ్రైవర్.. మనసులు గెలుచుకున్న వీడియో ఇదే!
- ఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద ఘటన
- సంస్కృతంలో సంభాషణ మొదలుపెట్టిన ప్రయాణికుడు
- సంస్కృతంలోనే అనర్గళంగా బదులిచ్చిన డ్రైవర్
- గతంలో సంస్కృతంలో గల్లీ క్రికెట్‌కు కామెంటరీ చెప్పిన ట్విట్టర్ యూజర్
దేశంలోని అత్యంత పురాతన భాష అయిన సంస్కృతాన్ని ‘దేవభాష’గా చెబుతారు. అంతేకాదు, ఇతర భాషలకు కూడా ఇదే మూలం. అంతటి ప్రాముఖ్యం ఉన్న ఈ భాషను మాట్లాడేవారు ఇప్పుడు ఒక్క శాతం మంది మాత్రమేనంటే ఆశ్చర్యం కలగకమానదు. హిందూ మతానికి సంబంధించిన కార్యక్రమాల్లో హిందూ రుత్విక్కులు కొందరు వాడుతూ ఉంటారు. కొందరు ఇంకా ఈ భాషను వాడుతుండడం వల్లే అదింకా సజీవంగా ఉంది.
తాజాగా, ఢిల్లీలో జరిగిన ఓ ఘటన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఓ క్యాబ్ డ్రైవర్ ప్రయాణికుడితో అనర్గళంగా సంస్కృతంలో మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాకెక్కి నెటిజన్ల మనసులు గెలుచుకుంది. ఇండియా గేట్ సమీపంలో ఈ వీడియోను రికార్డు చేసినట్టుగా తెలుస్తోంది. ‘అమేజింగ్’ క్యాప్షన్‌తో ఓ ట్విట్టర్ యూజర్ ఈ వీడియోను షేర్ చేశాడు. ‘అద్భుతం.. ఈ కారు డ్రైవర్ నాతో ఈ ఉదయం సంస్కృతంలో మాట్లాడాడు’ అని పేర్కొన్నాడు. అతడి ట్విట్టర్ హ్యాండిల్ ప్రకారం.. ఆయన మాతృభాష సంస్కృతంగా తెలుస్తోంది.