D Arvind: కవిత రాజకీయ జీవితం దాదాపు ముగిసిపోయింది: ధర్మపురి అర్వింద్

Kavitha political career almost ended says D Arvind

  • కేసీఆర్, కేటీఆర్, కవితకు విపరీతమైన కుల అహంకారం ఉందన్న అర్వింద్ 
  • మా అమ్మను భయపెట్టే హక్కు ఎవరిచ్చారని ప్రశ్న  
  • కవితకు దమ్ముంటే నాపై పోటీ చేయాలంటూ సవాల్ 

తెలంగాణ రాజకీయాల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు హైదరాబాద్ లోని అర్వింద్ ఇంటిపై టీఆర్ఎస్ శ్రేణులు దాడులు చేశాయి. ఈ నేపథ్యంలో అర్వింద్ నిజామాబాద్ లో మాట్లాడుతూ... రాజకీయంగా తనను ఓడిస్తానని కవిత అంటున్నారని... కవితకు దమ్ముంటే 2024 ఎన్నికల్లో తనపై పోటీ చేయాలని సవాల్ విసిరారు. 

ఆమెపై తాను ఏదో వ్యాఖ్యలు చేశానని అన్నారని.. ఆమె కాంగ్రెస్ లో చేరుతున్నట్టు కాంగ్రెస్ కు చెందిన ఒక సీనియర్ నేత తనకు ఫోన్ చేసి చెప్పారని తెలిపారు. తనకు తెలిసిన విషయాన్నే బయటకు చెప్పానని... కవిత గురించి తాను అభ్యంతరకరంగా మాట్లాడలేదని అన్నారు. అందరి ఫోన్లను ట్యాప్ చేస్తున్న కేసీఆర్... కవిత ఫోన్ ను కూడా ట్యాప్ చేస్తే అసలు విషయం తెలుస్తుందని అన్నారు. తమకు అన్ని పార్టీల్లో మిత్రులు ఉంటారని చెప్పారు. తాము ఎవరినీ వదిలిపెట్టమని... ఎప్పుడు ఏం చేయాలో అది చేస్తామని అన్నారు. 

కేసీఆర్, కేటీఆర్, కవిత విపరీతమైన కుల అహంకారంతో మాట్లాడుతున్నారని అర్వింద్ మండిపడ్డారు. ఇదేమైనా దొరల పాలన అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. మీ అయ్య మాట్లాడినట్టు తాను మాట్లాడనని చెప్పారు. ఇంట్లో మా అమ్మ ఉండగా భయపెట్టించేలా దాడికి పాల్పడ్డారని, దేవుడి పటాలు, కారు అద్దాలను పగులగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన తల్లిని భయపెట్టే హక్కు మీకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. 

ఏదైనా మాట్లాడితే దాడి చేస్తారా? అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత రాజకీయ బాధను తాను అర్థం చేసుకోగలనని... ఆమె రాజకీయ జీవితం దాదాపు ముగిసిపోయిందని అన్నారు. తనపై చీటింగ్ కేసు వేస్తానని కవిత అన్నారని... చీటింగ్ కేసు నాపై కాదు, మీ నాన్నపై వేసుకో అని వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ మేనిఫెస్టోనే చీటింగ్ అని అన్నారు. పసుపు రైతులను తాను మోసం చేయలేదని... నిజామాబాద్ లో 178 మంది నామినేషన్లు వేస్తే వారిలో 78 మంది బీజేపీ కండువా కప్పుకున్నారని చెప్పారు.

  • Loading...

More Telugu News