GV Reddy: జగన్ ను దించకపోతే రాష్ట్రం అంధకారంలో మునిగిపోతుంది: టీడీపీ నేత జీవీ రెడ్డి
- జగన్ పాలనలో విద్యుత్ రంగం కుదేలయిందన్న జీవీ రెడ్డి
- యూనిట్ విద్యుత్ ను రూ. 20కి కొనే పరిస్థితి తీసుకొచ్చారని విమర్శ
- రియలెస్టేట్, సినీ పరిశ్రమ కూడా కుదేలయ్యాయని వ్యాఖ్య
జగన్ పాలనలో విద్యుత్ రంగం కుదేలైపోయిందని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి జీవీ రెడ్డి విమర్శించారు. జగన్ చెప్పే మాటలకు, చేసే పనులకు పొంతన ఉండదని అన్నారు. చంద్రబాబు ముందు చూపుతో యూనిట్ కు రూ. 5 చొప్పున ఒప్పందం చేసుకుంటే... ఇందులో ఏదో పెద్ద స్కామ్ జరిగినట్టు జగన్ రాద్ధాంతం చేశారని.. ఇప్పుడు యూనిట్ ను రూ. 20లకు కొనే పరిస్థితిని తీసుకొచ్చారని మండిపడ్డారు. యనిట్ రూ. 20కి కొనే పరిస్థితి వచ్చిందంటే జగన్ పాలన ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు.
ఇసుక దొరక్క, పనులు లేక భవన నిర్మాణ కార్మికులు, కాంట్రాక్టర్లు అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి రంగంలో ప్రతి వ్యక్తిని ఆర్థికంగా ఎదగనివ్వకుండా దెబ్బకొడుతున్నారని... రూ. 100 కట్టాల్సిన విద్యుత్ బిల్లు రూ. 400 కట్టాల్సి వస్తోందని అన్నారు. సంక్షేమ పథకాల పేరుతో ఇస్తున్న డబ్బులను ఈ విధంగా జనాల నుండి లాగేస్తున్నారని మండిపడ్డారు. జగన్ రెడ్డిని పదవి నుంచి దించకపోతే రాష్ట్రం అంధకారంలో మునిగిపోతుందని అన్నారు.