TRS: మూడు వారాల తర్వాత తొలిసారి బయటకు వస్తున్న ఆ నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు
- 22 రోజుల తర్వాత తొలిసారి బయటకు వస్తున్న ఎమ్మెల్యేలు
- రక్షణ కోసమే ప్రగతి భవన్‌లో ఉన్నామన్న శాసనసభ్యులు
- ఎమ్మెల్యేలు కనిపించడం లేదంటూ పోలీసులకు కాంగ్రెస్ ఫిర్యాదు
మూడు వారాలుగా ప్రగతి భవన్‌కే పరిమితమైన ఎమ్మెల్యే కొనుగోలు కేసు బాధితులుగా చెప్పుకుంటున్న నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పైలట్ రోహిత్ రెడ్డి, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, రేగ కాంతారావు, గువ్వల బాలరాజు నేడు బయటకు రానున్నారు. ఈ విషయాన్ని రోహిత్ రెడ్డి స్వయంగా వెల్లడించారు. 22 రోజులుగా ప్రగతి భవన్‌లో ఉంటున్న వారిని మునుగోడు ఉప ఎన్నిక ప్రచార సభకు ముఖ్యమంత్రి ఒకసారి తీసుకెళ్లి అక్కడి ప్రజలకు పరిచయం చేశారు.
కాగా, ఇన్ని రోజులుగా వారు ప్రగతి భవన్‌కు పరిమితం కావడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, రక్షణ కోసమే తాము ప్రగతి భవన్‌లో ఉన్నట్టు ఎమ్మెల్యేలు చెప్పుకొచ్చారు. ఇకపై తాను నియోజకవర్గ అభివృద్ధిపై దృష్టి పెడతానని రోహిత్ రెడ్డి తెలిపారు. నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కరిస్తానన్నారు. ఈ సారి కూడా టికెట్ తనకే దక్కుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. నేడు బయటకు రాగానే రోహిత్‌రెడ్డి అయ్యప్పమాల ధరించనున్నారు.
మరోవైపు, మూడు వారాలుగా ఎమ్మెల్యేలు కనిపించకపోవడంపై కాంగ్రెస్ ఫిర్యాదు చేసింది. తాండూరు, కొల్లాపూర్ ఎమ్మెల్యేలు కనిపించడం లేదంటూ ఆ పార్టీ నాయకులు నిన్న పోలీసులకు ఫిర్యాదు చేశారు. రోహిత్‌రెడ్డి కనిపించకపోవడంతో ఆయనను గెలిపించిన ప్రజలు ఆందోళన చెందుతున్నారని, ప్రగతి భవన్ నుంచి ఆయనకు విముక్తి కల్పించాలంటూ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, పరిగి మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి తాండూరు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అలాగే, కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్‌రెడ్డి కనిపించడం లేదంటూ టీపీసీసీ సభ్యుడు రంగినేని అభిలాషరావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు కొల్లాపూర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.