Prime Minister: ఒకే రోజు మూడు రాష్ట్రాల్లో ప్రధాని పర్యటన.. అరుణాచల్ ఎయిర్ పోర్ట్ ప్రారంభం
- ఇటానగర్ సమీపంలో డోనీ పోలో ఎయిర్ పోర్ట్ ప్రారంభం
- అభివృద్ధిని ఎన్నికలు, రాజకీయాలతో లింక్ పెట్టొద్దని హితవు
- వారణాసి, గుజరాత్ లోనూ పర్యటించనున్న ప్రధాని
ప్రధాని మోదీ ఒకే రోజు మూడు రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఇది అరుదైన విషయమే. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, గుజరాత్ లో ప్రధాని పర్యటన నేడు కొనసాగనుంది. తొలుత అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్ కు 25 కిలోమీటర్ల దూరంలో నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ ను ప్రధాని ప్రారంభించారు. ఇక్కడి నుంచి యూపీలోని తన నియోజకవర్గమైన వారణాసికి వెళతారు. అక్కడ నెల రోజుల పాటు సాగే కాశీ తమిళ్ సంగమం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అనంతరం వచ్చే నెల ఎన్నికలు జరిగే స్వరాష్ట్రం గుజరాత్ కు వెళతారు.
ఇక ఇటానగర్ సమీపంలోని డోనీ పోలో ఎయిర్ పోర్ట్ ను ప్రారంభించిన అనంతరం ప్రధాని మాట్లాడారు. ఎన్నికల కోసం పునాది రాయి వేస్తున్నారంటూ ఆరోపించిన వారి ముఖంపై, తాజా ప్రారంభోత్సవం చెంప దెబ్బ వంటిదన్నారు. అభివృద్ధిని రాజకీయాలకు, ఎన్నికలకు ముడి పెట్టి చూడొద్దని కోరారు. 2019 లోక్ సభ ఎన్నికల ముందు ప్రధాని ఈ ఎయిర్ పోర్ట్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. దీంతో దీన్ని ఎన్నికల ఎత్తుగడగా ప్రతిపక్షాలు విమర్శించాయి.
అరుణాచల్ లో 600 మెగావాట్ల కమెంగ్ హైడ్రో పవర్ స్టేషన్ ను ప్రధాని జాతికి అంకితం చేశారు. దీంతో విద్యుత్ పరంగా అరుణాచల్ మిగులు రాష్ట్రంగా మారింది.