Sajjala Ramakrishna Reddy: కర్నూలులో చంద్రబాబు విన్యాసాలు అందరూ చూశారు: సజ్జల
- నిన్న కర్నూలులో చంద్రబాబు ఉగ్రరూపం
- వైసీపీ శ్రేణులపై నిప్పులు చెరిగిన టీడీపీ అధినేత
- చంద్రబాబు తీవ్ర అసహనంలో ఉన్నారన్న సజ్జల
టీడీపీ అధినేత చంద్రబాబు కర్నూలులో ప్రసంగించిన తీరుపై ఏపీ ప్రభుత్వ సలహాదారు, వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. చంద్రబాబు తీవ్ర నిస్పృహలో ఉన్నారని విమర్శించారు. న్యాయ రాజధానిపై వైఖరి అడిగితే చంద్రబాబు సమాధానం చెప్పాలని స్పష్టం చేశారు.
వికేంద్రీకరణపై తమకు స్పష్టత ఉందని, వికేంద్రీకరణ ఎందుకు అవసరమో తాము స్పష్టంగా చెబుతున్నామని, కానీ వికేంద్రీకరణ ఎందుకు వద్దంటున్నారో, అమరావతే ఎందుకు రాజధానిగా కావాలంటున్నారో చంద్రబాబు చెప్పలేకపోతున్నారని సజ్జల విమర్శించారు.
"కర్నూలు వెళ్లినప్పుడు న్యాయరాజధానిపై ప్రజలు అడగరా? ప్రజలు అడిగితే సమాధానం చెప్పకుండా బెదిరిస్తారా? టీడీపీ అంటేనే తిట్లు, దూషణలు, బూతులు! కర్నూలులో చంద్రబాబు విన్యాసాలను అందరూ చూశారు. సీఎం మీద, వైసీపీ నేతల మీద, ఆఖరికి ప్రజల మీద కూడా బూతులతో దాడి చేశారు. చంద్రబాబుకు అంత కోపం ఎందుకు? మొన్నామధ్య పవన్ కల్యాణ్ పూనకం వచ్చినట్టు ఊగిపోయారు. ఇప్పుడు చంద్రబాబుకు కూడా పవన్ కల్యాణ్ లాగా చెప్పు చూపించాలని కోరిక కలిగినట్టుంది" అంటూ సజ్జల వివరించారు.