Team India: రెండో టీ20లో టీమిండియా ఆల్ రౌండ్ షో... కివీస్ పై ఘనవిజయం
- మౌంట్ మాంగనూయ్ లో మ్యాచ్
- మొదట 6 వికెట్లకు 191 పరుగులు చేసిన భారత్
- 18.5 ఓవర్లలో 126 పరుగులకు ఆలౌట్ అయిన కివీస్
- 4 వికెట్లు తీసిన దీపక్ హుడా
మౌంట్ మాంగనూయ్ లో న్యూజిలాండ్ తో జరిగిన రెండో టీ20 మ్యాచ్ లో టీమిండియా ఘనవిజయం నమోదు చేసింది. కివీస్ ను 65 పరుగుల తేడాతో ఓడించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 191 పరుగులు చేసింది. సూర్యకుమార్ యాదవ్ ఆకాశమే హద్దుగా చెలరేగి 51 బంతుల్లోనే 111 పరుగులతో అజేయంగా నిలిచాడు. అనంతరం, 192 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ఆతిథ్య కివీస్ 18.5 ఓవర్లలో 126 పరుగులకే కుప్పకూలింది. దీపక్ హుడా 10 పరుగులిచ్చి 4 వికెట్లు తీయడం విశేషం.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్ లో కెప్టెన్ కేన్ విలియమ్సన్ 61 పరుగులు చేశాడు. విలియమ్సన్ కు ఇతర బ్యాట్స్ మెన్ నుంచి సహకారం లభించకపోవడంతో కివీస్ కు ఓటమి తప్పలేదు. టీమిండియా బౌలర్లలో సిరాజ్, చహల్ రెండేసి వికెట్లు తీయగా, భువనేశ్వర్ కుమార్ 1, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ పడగొట్టారు.
ఈ విజయంతో మూడు టీ20ల సిరీస్ లో భారత్ 1-0తో ముందంజ వేసింది. వరుణుడి ప్రభావంతో తొలి టీ20 రద్దయిన సంగతి తెలిసిందే. ఇక ఇరుజట్ల మధ్య చివరిదైన మూడో టీ20 నవంబరు 22న నేపియర్ లో జరగనుంది.