Bangladesh: అచ్చం సినిమాలోలానే.. కోర్టు వద్ద తప్పించుకున్న మరణశిక్ష పడిన ఖైదీలు!

2 death row convicts in murder case flee from court premises

  • బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో ఘటన
  • బైక్‌లపై వచ్చి పోలీసులపై స్ప్రే చల్లి ఖైదీలను తప్పించుకుపోయిన దుండగులు
  • వారిని పట్టుకునేందుకు దేశంలో అలెర్ట్ ప్రకటించిన ప్రభుత్వం

మరణశిక్ష పడిన ఇద్దరు ఖైదీలు బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో కోర్టు నుంచి బయటకు వస్తూ సినీ ఫక్కీలో తప్పించుకోవడం సంచలనమైంది. వారిని వెతికి పట్టుకునేందుకు ఇప్పుడు పెద్ద టీమే బయలుదేరింది. ప్రముఖ బంగ్లాదేశ్-అమెరికన్ బ్లాగర్ అవిజిత్ రాయ్, ఆయన పబ్లిషర్ ఫైజల్ అరెఫిన్ డిపన్‌ల హత్య కేసుల్లో అన్సురుల్లా బంగ్లా టీం ఉగ్రవాద సంస్థకు చెందిన మెయినుల్ హసన్ షమీమ్, అబు సిద్ధిఖ్ సోహెల్‌లకు కోర్టు గతేడాది మరణశిక్ష విధించింది. 

వేరే కేసుల్లోనూ నిందితులైన వీరిని నిన్న విచారణ కోసం ఢాకా కోర్టుకు తీసుకొచ్చారు. విచారణ అనంతరం తిరిగి వారిని జైలుకు తరలించేందుకు కోర్టు బయటకు తీసుకురాగా అప్పుడే అనూహ్య ఘటన జరిగింది. బైక్‌లపై కోర్టు ఆవరణలోకి దూసుకొచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు ఎస్కార్టు పోలీసులపై రసాయనాలు స్ప్రే చేయడంతో వారి కళ్లు బైర్లు కమ్మాయి. ఆ ప్రాంతం నిండా పొగ కమ్ముకుంది. ఇదే అదునుగా ఖైదీలు ఇద్దరినీ తమ బైక్‌లపై ఎక్కించుకుని వచ్చినంత వేగంగా అక్కడి నుంచి పరారయ్యారు. 

హై ప్రొఫైల్ హత్య కేసుల్లోని దోషులను సాధారణ ఖైదీల్లా ఇద్దరు ఎస్కార్ట్ పోలీసులతో కోర్టుకు పంపడం ఏంటని కోర్టు అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఖైదీల చేతులకు మాత్రమే సంకెళ్లు వేశారని అంటున్నారు. ఉగ్రవాదులు తప్పించుకోవడంతో వారిని పట్టుకునేందుకు దేశవ్యాప్తంగా రెడ్ అలెర్ట్ ప్రకటించారు. 

ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించినట్టు బంగ్లాదేశ్ హోంశాఖ మంత్రి అసదుజమాన్ ఖాన్ కమల్ తెలిపారు. కాగా, మత ఛాందసవాదాన్ని బహిరంగంగా విమర్శించడాన్ని జీర్ణించుకోలేకపోయిన ఉగ్రవాదులు ఫిబ్రవరి 2015లో అవిజిత్‌ రాయ్‌ను హతమార్చారు. అదే ఏడాది నవంబరులో డిపన్‌ను కూడా హత్యచేశారు.

  • Loading...

More Telugu News