Team India: కోహ్లీ వీడియో గేమ్ కామెంట్ పై సూర్య స్పందన
- న్యూజిలాండ్ తో రెండో టీ20లో సూర్య మెరుపు సెంచరీ
- ఘన విజయం సాధించిన భారత జట్టు
- సూర్య బ్యాటింగ్ వీడియో గేమ్ లా ఉందన్న విరాట్ కోహ్లీ
న్యూజిలాండ్ తో జరిగిన రెండో టీ20లో చెలరేగి ఆడిన సూర్యకుమార్ యాదవ్ భారత్ కు ఘన విజయంతో పాటు అభిమానులకు వినోదాన్ని అందించాడు. 51 బంతుల్లోనే అజేయంగా 111 పరుగులు చేశాడు. తనకు మాత్రమే సాధ్యమయ్యే అద్భుత షాట్లతో సూర్య కుమార్ న్యూజిలాండ్ బౌలింగ్ ను ఊచకోత కోశాడు. అతని బ్యాటింగ్ కు అభిమానులే కాదు భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ సైతం ఫిదా అయ్యాడు. సూర్య బ్యాటింగ్ వీడియో గేమ్ లా ఉందంటూ ట్వీట్ చేశాడు. మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో సూర్యకు ఇదే విషయాన్ని ఓ జర్నలిస్టు తెలియజేశాడు.
దాంతో, కోహ్లీతో తన అనుబంధాన్ని సూర్య గుర్తు చేసుకున్నాడు. కోహ్లీ ట్వీట్‌ను కాంప్లిమెంట్‌గా తీసుకుంటానని, ఇంకా మెరుగ్గా రాణిస్తానని సూర్య చెప్పాడు. ‘మొన్నటి ప్రపంచ కప్ లో మేమిద్దరం కలిసి ఆడాం. చాలా మంచి భాగస్వామ్యాలను నెలకొల్పాం. మైదానంలో కలిసి బ్యాటింగ్ చేస్తున్నప్పుడు ఇద్దరం ఎక్కువగా మాట్లాడుకోం. నేను నా ఉత్తమ ఆట చూపెట్టాలని సలహా ఇస్తుంటాడు. ఇప్పుడు కోహ్లీ చెప్పిన దాన్ని నేను అభినందనగా తీసుకుంటాను. నా ఆటకు ఇంకా మెరుగుపరుచుకొని, మరింత నిలకడగా ఎలా ఆడాలో చూస్తాను’ అని సూర్యకుమార్ పేర్కొన్నాడు.