Telangana: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యక్తిగత అదనపు కార్యదర్శి కుమారుడి ఆత్మహత్య
- గచ్చిబౌలిలోని ఓ కంపెనీలో పది రోజుల క్రితమే ఉద్యోగంలో చేరిన అక్షయ్ కుమార్
- మహబూబ్‌నగర్‌లో డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తామని పలువురి నుంచి డబ్బులు వసూలు చేసిన కేసులో అరెస్ట్
- ఆత్మహత్యకు కారణం తెలియరాలేదన్న పోలీసులు
తెలంగాణ ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యక్తిగత అదనపు కార్యదర్శి దేవేందర్ కుమారుడు అక్షయ్ కుమార్ (23) ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్ గచ్చిబౌలి పోలీసుల కథనం ప్రకారం.. మహబూబ్‌నగర్‌లోని మోనప్పగుట్టకు చెందిన దేవేందర్.. మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు వ్యక్తిగత అదనపు కార్యదర్శిగా ఉన్నారు. ఆయన కుమారుడు అక్షయ్ కుమార్ బీటెక్ పూర్తి చేశాడు. గచ్చిబౌలిలోని ఓ ఎమ్మెన్సీ కంపెనీలో ఉద్యోగం రావడంతో పది రోజుల క్రితం ఆయన నగరానికి వచ్చాడు. మేనబావ అయిన గల్లా నవీన్ కుమార్ వద్ద ఉంటూ ఉద్యోగానికి వెళ్లి వస్తున్నారు.
నవీన్ కుమార్ ఈ నెల 20న ఊరెళ్లారు. నిన్న ఉదయం ఊరి నుంచి వచ్చిన నవీన్.. ప్లాట్ తలుపులు మూసి ఉండడంతో తలుపు కొట్టారు. ఎంతసేపటికీ తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన ఆయన తన వద్ద నున్న ఇంకో తాళంతో తలుపులు తెరిచి లోపలికి వెళ్లారు. బెడ్రూంలో కనిపించిన దృశ్యం చూసి షాకయ్యారు. అక్షయ్ ఉరి తాడుకు వేలాడుతూ కనిపించాడు. నవీన్ వెంటనే ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. వారొచ్చి మృతదేహాన్ని కిందికి దింపి ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదని, గదిలో ఎలాంటి సూసైడ్ నోట్ దొరకలేదని పోలీసులు తెలిపారు. కాగా, మహబూబ్‌నగర్‌లో డబుల్ బెడ్రూం ఇళ్లు ఇప్పిస్తామని పలువురి నుంచి డబ్బులు వసూలు చేసిన కేసులో సెప్టెంబరు 30న పోలీసులు అక్షయ్ సహా నలుగురిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆ తర్వాత బెయిలుపై బయటకు వచ్చిన అక్షయ్ హైదరాబాద్‌లో ఉంటున్నారు. ఆయన ఆత్మహత్యకు కారణం తెలియరాకున్నా.. అరెస్ట్ విషయంలో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని చెబుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.