MD Siraj: వికెట్ల పండగ చేసుకున్న సిరాజ్, అర్షదీప్... టీమిండియా టార్గెట్ 161 రన్స్
- నేపియర్ లో భారత్, కివీస్ మూడో టీ20
- టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన కివీస్
- 19.4 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌట్
- చెరో 4 వికెట్లు పడగొట్టిన సిరాజ్, అర్షదీప్
నేపియర్ లో భారత బౌలర్లు విజృంభించారు. న్యూజిలాండ్ తో మూడో టీ20లో టీమిండియా పేసర్లు మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్ చెరో 4 వికెట్లు పడగొట్టారు. తద్వారా కివీస్ భారీ స్కోరు సాధించకుండా కట్టడి చేశారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. 19.4 ఓవర్లలో 160 పరుగులకు ఆలౌట్ అయింది.
ఓ దశలో 2 వికెట్లకు 130 పరుగులతో పటిష్ఠంగా ఉన్న కివీస్... ఆ తర్వాత మరో 30 పరుగుల వ్యవధిలో మిగతా 8 వికెట్లు చేజార్చుకుంది. ఓపెనర్ డెవాన్ కాన్వే (59), గ్లెన్ ఫిలిప్స్ (54) అర్ధసెంచరీలతో రాణించినా, ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్ మెన్ పేలవంగా ఆడి అవుటయ్యారు. సిరాజ్, అర్షదీప్ ధాటికి కివీస్ బ్యాటర్లు నిలవలేకపోయారు.
ఆతిథ్య జట్టు ఇన్నింగ్స్ లో ఆరుగురు బ్యాట్స్ మెన్ సింగిల్ డిజిట్ కే వెనుదిరిగారు. వారిలో ముగ్గురు డకౌట్ అయ్యారు. హర్షల్ పటేల్ కు ఓ వికెట్ దక్కింది.