K Kavitha: మొన్న దొంగ ప్రమాణాలు.. నిన్న ఒకటే ఏడుపు: బండి సంజయ్‌పై కవిత వ్యంగ్యాస్త్రాలు
- రాముడి పేరు చెప్పి బీజేపీ రౌడీయిజం చేస్తోందన్న కవిత
- బీజేపీకి ఓ సిద్ధాంతమంటూ లేదని విమర్శ
- గద్దల్లా వచ్చి నాయకులను తన్నుకుపోవడమే ఆ పార్టీకి తెలుసని ఆరోపణ
కామారెడ్డి జిల్లా నాగిరెడ్డి పేట మండలం తాండూరులో జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ కవిత.. బీజేపీని, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను లక్ష్యంగా చేసుకున్నారు. బీజేపీకి ఓ సిద్ధాంతమంటూ లేదని, వారెప్పుడూ ప్రజల్లో లేరని దుయ్యబట్టారు. బీజేపీ ఏం చేసుకున్నా తెలంగాణ ప్రజలు భయపడబోరని తేల్చి చెప్పారు. తమ నేతలు చట్టబద్ధంగానే వ్యాపారాలు చేసుకుంటున్నారని, అధికారులు వచ్చి అడిగితే పత్రాలు ఇస్తామని, చూసుకుని వెళ్లాలని అన్నారు.
బండి సంజయ్ యాదగిరిగుట్ట వెళ్లి దొంగ ప్రమాణాలు చేశారని, నిన్నయితే ఓ సభలో ఏకంగా ఏడ్చేశారని, ఎందుకేడ్చారో తెలియదని ఎద్దేవా చేశారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో దొరికిన బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్‌ను అరెస్ట్ చేయొద్దని బండి సంజయ్ అంటున్నారని కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన కోసం కోర్టుకు కూడా వెళ్లారని గుర్తు చేశారు. విచారణకు కూడా రానని సంతోష్ అంటున్నారని పేర్కొన్నారు.
టీఆర్ఎస్ మంత్రులు మాత్రం ఐటీ పిలిచినా, ఈడీ పిలిచినా, సీబీఐ పిలిచినా వెళ్తున్నారని, వారికి భయం లేకపోవడమే అందుకు కారణమని అన్నారు. రాజకీయంగా బలంగా ఉన్న టీఆర్ఎస్ పార్టీ నేతలను గద్దల్లా వచ్చి తన్నుకు పోవాలని బీజేపీ చూస్తోంది తప్పితే, వారికి మరో లక్ష్యం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాముడి పేరు చెప్పడం, రౌడీయిజం చేయడం తప్ప బీజేపీకి మరో పనే లేదని విమర్శించారు. బీజేపీకి ఓ అబద్ధాల వాట్సాప్ యూనివర్సిటీ ఉందని, అందులో అన్నీ అబద్ధాలే చెబుతున్నారని, కాబట్టి బీజేపీ మాటలను నమ్మొద్దని హితవు పలికారు.