Anantapur District: విద్యుత్ సరఫరా ఆపేసి టీడీపీ నేత జేసీ అస్మిత్‌రెడ్డిపై రాళ్లదాడి
- మూడు రోజులుగా తాడిపత్రి మునిసిపాలిటీలో పర్యటిస్తున్న అస్మిత్‌రెడ్డి
- వైసీపీ కౌన్సిలర్ ఫయాజ్ బీడీ ఫ్యాక్టరీ వద్ద దాడి
- ప్రతిదాడికి దిగిన టీడీపీ కార్యకర్తలు
తాడిపత్రి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ జేసీ అస్మిత్‌రెడ్డిపై కొద్దిసేపటి క్రితం దాడి జరిగింది. దీంతో అనంతపురం జిల్లా తాడిపత్రి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. అస్మిత్‌రెడ్డి మూడు రోజులుగా తాడిపత్రి మున్సిపాలిటీలోని వివిధ కాలనీల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో ఈ సాయంత్రం మూడో వార్డులో పర్యటిస్తుండగా వైసీపీ కౌన్సిలర్ ఫయాజ్ బాషా బీడీ ఫ్యాక్టరీ వద్దకు చేరుకోగానే ఆయనపై రాళ్ల దాడి జరిగింది.
విద్యుత్ సరఫరా ఆపేసిన కొందరు ఆయనపై రాళ్లదాడికి పాల్పడ్డారు. ఈ దాడితో అప్రమత్తమైన టీడీపీ కార్యకర్తలు కూడా రాళ్ల దాడికి దిగారు. ఈ పరస్పర దాడిలో ఇద్దరు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. ఈ దాడి నుంచి తప్పించుకున్న అస్మిత్‌రెడ్డి ఓ ఇంట్లోకి వెళ్లి దాక్కున్నారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టారు. గాయపడిన వారిని తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు.
ఆ రాళ్లు త్వరలోనే తాడేపల్లి ప్యాలెస్‌ను తాకుతాయి: లోకేశ్
అస్మిత్‌రెడ్డిపై జరిగిన దాడిని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఖండించారు. టీడీపీకి పెరుగుతున్న ప్రజాదరణను చూసి ఓర్వలేక వైసీపీ ముష్కర మూకలు ఇలాంటి దాడులకు పాల్పడుతున్నాయన్నారు. ఇటీవల చంద్రబాబు కాన్వాయ్‌పై రాళ్లదాడికి తెగబడ్డారని, ఇప్పుడు అస్మిత్‌రెడ్డిపై దాడికి తెగబడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికార ఉన్మాద ఫ్యాక్షన్ రాజకీయాలు ప్రజాస్వామ్యానికే ముప్పుగా పరిణమించాయన్నారు. వీధి లైట్లు ఆపేసి చీకట్లో దాడి చేసి పిరికిపందల్లా పోలీసుల వెనక దాక్కున్నారని అన్నారు. దమ్ముంటే ఎదురుగా వచ్చి ఎదుర్కోవాలని సవాలు చేశారు. తాడిపత్రిలో విసిరిన రాళ్లు త్వరలోనే తాడేపల్లి ప్యాలెస్‌ను తాకుతాయని లోకేశ్ హెచ్చరించారు.