Telugudesam: హోటల్ నిర్వాహకుడి సమాధానంతో కంగుతిన్న వైసీపీ ఎమ్మెల్యే!

My Vote for TDP Only Hotel Owner Says to MLA Chitti Babu in P Gannavaram
  • వాడ్రేవుపల్లిలో ఎమ్మెల్యే చిట్టిబాబుకు ఎదురైన విచిత్ర పరిస్థితి
  • గడప గడపకూ వైసీపీ కార్యక్రమంలో ప్రజలను కలుస్తున్న అధికార పార్టీ నేతలు
  • ప్రైవేటు స్కూలు విద్యార్థులకు అమ్మ ఒడి పథకం ఇవ్వొద్దని జనం డిమాండ్
ఆంధ్రప్రదేశ్ లో అధికార పార్టీ వైసీపీ చేపట్టిన ‘గడప గడపకూ వైసీపీ’ కార్యక్రమంలో నేతలకు కొన్ని చోట్ల ప్రజల నుంచి నిరసన ఎదురవుతోంది. కొందరు నేతలైతే విచిత్ర పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబుకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది. వాడ్రేవుపల్లిలోని ఓ హోటల్ నిర్వాహకుడు మేం తెలుగుదేశానికే ఓటేస్తామని కరాఖండీగా చెప్పడంతో ఎమ్మెల్యే కంగుతిన్నారు. 

రాష్ట్రంలో మరోమారు అధికారం చేపట్టడమే లక్ష్యంగా వైసీపీ ప్రభుత్వం గడప గడపకూ కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా పార్టీ నేతలు జనాల్లోకి వెళుతున్నారు. పి.గన్నవరం ఎమ్మెల్యే చిట్టిబాబు కూడా తన నియోజకవర్గంలోని వాడ్రేవుపల్లి గ్రామంలో పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి జనాలను కలిశారు. వాళ్ల క్షేమ సమాచారాలు అడుగుతూ మరోమారు జగనన్నకే ఓటేయాలని కోరారు.

వాడ్రేవుపల్లి గ్రామంలోని హోటల్ నిర్వాహకుడు పాపారావును ఎమ్మెల్యే కలిశారు. ఈ సందర్భంగా హోటల్ నిర్వాహకుడు పాపారావు ఎమ్మెల్యేతో మాట్లాడుతూ.. ప్రైవేటు స్కూళ్లలో చదువుతున్న విద్యార్థులకు అమ్మ ఒడి పథకం ఇవ్వొద్దని, పింఛన్లను నేరుగా లబ్దిదారుల ఖాతాల్లోనే జమచేయాలని కోరారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. 

దీనికి సరేనన్న ఎమ్మెల్యే చిట్టిబాబు.. వైసీపీకే ఓటేయాలని పాపారావును కోరారు. అయితే, చేపల కూర పంపిస్తున్నాం తినండి కానీ, మా ఓటు మాత్రం టీడీపీకే వేస్తామని సదరు హోటల్ నిర్వాహకుడు తేల్చిచెప్పాడు. ‘మీరు జై జగన్ అన్నా.. మేం టీడీపీకే ఓటు వేస్తాం’ అని స్పష్టం చేశాడు. దీంతో ఎమ్మెల్యే చిట్టిబాబు అక్కడి నుంచి వెళ్లిపోయారు.
Telugudesam
YSRCP
mla chittibabu
p gannavaram
hotel
my vote
tdp

More Telugu News