Bollywood: భారత సైన్యానికి క్షమాపణ చెప్పిన బాలీవుడ్ హీరోయిన్.. కారణం ఇదే!
- ప్రభుత్వం ఆదేశిస్తే పాక్ ఆక్రమిత కశ్మీర్ ను తిరిగి సొంతం చేసుకుంటామన్న లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది
- ఈ ప్రకటనపై ‘గాల్వాన్ హాయ్ చెబుతోంది’ అని ట్వీట్ చేసిన రిచా
- సైన్యాన్ని అవమానించేలా ట్వీట్ ఉందని రిచాపై పలువురి విమర్శలు
- ఎవ్వరినీ కించపరిచే ఉద్దేశం తనకు లేదని బాలీవుట్ నటి వివరణ
బాలీవుడ్ నటి రిచా చద్దా భారత సైన్యానికి క్షమాపణ చెప్పింది. గాల్వాన్‌పై ఆమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో పెద్ద దుమారం రేపడంతో రిచా చద్దా క్షమాపణలు కోరింది. ఎవ్వరినీ నొప్పించే ఉద్దేశం తనకు లేదని, తన ట్వీట్ వల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే క్షమాపణలు కోరుతున్నానని వివరణ ఇచ్చింది. పాక్ ఆక్రమిత కశ్మీర్‌ను తిరిగి స్వాధీనం చేసుకోవడం వంటి ఆదేశాలను అమలు చేయడానికి భారత సైన్యం ఎప్పుడూ సిద్ధంగా ఉందని లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఓ ప్రకటన చేశారు. దీనిపై స్పందిస్తూ రిచా ట్విట్టర్ లో ‘గాల్వాన్ హాయ్ చెబుతోంది’ అని ట్వీట్ చేసింది.
ఇది భారత భారత సైన్యాన్ని ఎగతాళి చేసేలా, గాల్వాన్ ఘర్షణలో భారత జవాన్ల త్యాగాన్ని తక్కువ చేసేలా ఉందని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. దాంతో, సోషల్ మీడియాలో ఆమె విపరీతమైన ట్రోలింగ్ కు గురైంది. పలువురు నాయకులు, సామాన్య ప్రజలు రిచాపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
దాంతో, రిచా స్పందిస్తూ, తాను దురుద్దేశపూర్వకంగా ఈ ట్వీట్ చేయలేదని చెప్పింది. తన తాత లెఫ్టినెంట్ కల్నల్ హోదాలో భారత సైన్యంలో పని చేశారని తెలిపింది. భారత్-చైనా యుద్ధంలో ఆయన కాలికి బుల్లెట్ కూడా తగిలిందని చెప్పింది. తన మావయ్య ఓ పారా ట్రూపర్ గా పని చేశారని, తమది సైనికుల కుటుంబమని తెలిపింది.