Jada Sravan Kumar: విజయసాయి ఫోన్ ఇప్పుడే ఎందుకు పోయింది?: జడ శ్రవణ్ కుమార్
- విజయసాయి ఫోన్ మిస్సింగ్
- ఫోన్ పోతే కేసు రిజిస్టర్ చేయరన్న శ్రవణ్
- ఫోన్ ఎవరైనా కొట్టేస్తేనే కేసు నమోదు చేస్తారని వ్యాఖ్య
జై భీం భారత్ పార్టీ అధ్యక్షుడు, ప్రముఖ న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ఫోన్ వ్యవహారంపై స్పందించారు. విజయసాయిరెడ్డి ఫోన్ ఇప్పుడే ఎందుకు పోయిందని సందేహం వ్యక్తం చేశారు. ఒకవేళ ఢిల్లీ లిక్కర్ స్కాంలో విచారణ జరిగితే ఫోన్ లేదని చెబితే ఎలా? అని ప్రశ్నించారు. అయినా ఫోన్ పోతే కేసు రిజిస్టర్ చేయరని, ఎవరైనా ఫోన్ కొట్టేస్తేనే రిజిస్టర్ చేస్తారని జడ శ్రవణ్ కుమార్ స్పష్టం చేశారు.
రాష్ట్రంలో దశల వారీగా మద్య నిషేధం అన్నారని, ఇప్పుడు ఆ ఊసే ఎత్తడం లేదని విమర్శించారు. మద్యనిషేధం అంటున్నప్పుడు మద్యం అమ్మకాలు ఏటా ఎలా పెరుగుతున్నాయి? అని నిలదీశారు. బెల్టు షాపులు తీసేస్తామని చెప్పారని, మద్యం నేరుగా ప్రభుత్వమే అమ్ముతోందని శ్రవణ్ కుమార్ విమర్శించారు.
రూ.35 వేల కోట్ల మద్యం విక్రయిస్తూ సగం కూడా లెక్కల్లో చూపడంలేదని అన్నారు. ఇన్ని అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రి ఎక్కడా ఉండరేమో అని వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో 175 సీట్లలో ఈ ప్రభుత్వానికి 17 సీట్లు కూడా రావని అభిప్రాయపడ్డారు.