Amit Shah: ఉమ్మడి పౌరస్మృతి అమలుపై అమిత్ షా కీలక వ్యాఖ్యలు

Will implement UCC but after open and healthy debate says Amit Shah
  • దేశంలో యూసీసీ అమలుకు బీజేపీ కట్టుబడి ఉందన్న కేంద్ర హోం మంత్రి
  • ప్రజాస్వామిక ప్రకియలు, సంప్రదింపుల తర్వాతే అమలు చేస్తామని వెల్లడించిన షా
  • హిమాచల్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీదే విజయమన్న కేంద్ర మంత్రి 
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) విషయంపై తరచూ చర్చ జరుగుతోంది. కుల, మతాలతో సంబంధం లేకుండా దేశంలో ప్రతి ఒక్కరికీ ఒకే రకమైన చట్టం ఉండేలా చేస్తామని బీజేపీ నాయకులు చెబుతూ వస్తున్నారు. ఈ విషయంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. దేశంలో ఉమ్మడి పౌరస్మృతిని తీసుకొచ్చేందుకు బీజేపీ కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. అయితే, అన్ని రకాల ప్రజాస్వామిక ప్రక్రియలను అనుసరిస్తామని చెప్పారు. సంబంధిత అన్ని వర్గాలతో ఆరోగ్యకరమైన, బహిరంగ సంప్రదింపుల తర్వాతే యూసీసీని తీసుకొస్తామని షా స్పష్టం చేశారు.   

బీజేపీ.. భారతీయ జనసంఘ్ గా ఉన్నప్పటి నుంచే ఉమ్మడి పౌరస్మృతిపై దేశ ప్రజలకు హామీ ఇచ్చిందని అమిత్ షా గుర్తుచేశారు. ‘రాజ్యాంగ సభ కూడా సరైన సమయం వచ్చినప్పుడు, యూసీసీని అమలు చేయాలని సూచించింది. ఏ లౌకిక దేశమైనా, మతం ఆధారంగా చట్టాలు చేయలేదు. దేశం, దాని రాష్ట్రాలు సెక్యులర్ అయినప్పుడు, మతం ఆధారంగా చట్టాలు ఎలా ఉంటాయి? పార్లమెంటు ఆమోదించిన ఒకే చట్టం ఉండాలి’ అని ఆయన పేర్కొన్నారు. దేశంలో బీజేపీ తప్ప ఇతర పార్టీలేవీ ఉమ్మడి పౌరస్మృతి పట్ల అనుకూలంగా లేవని అమిత్ షా పేర్కొన్నారు. కాగా, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో, మున్సిపల్ కార్పొరేషన్ అఫ్ ఢిల్లీ(ఎంసీడీ) ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు.
Amit Shah
BJP
central government
UCC

More Telugu News