Uttarakhand: ఉత్తరాఖండ్ వక్ఫ్ బోర్డ్ సంచలన ప్రకటన.. నవీన రూపు సంతరించుకోనున్న మదర్సాలు
- విద్యాబోధన, డ్రెస్ కోడ్ విషయంలో భారీ మార్పులకు శ్రీకారం
- ఉత్తరాఖండ్‌లో ఏడు మోడల్ మదర్సాల ఏర్పాటు
- ఇతర పాఠశాలల్లానే విద్యాబోధన
- ఇతర మతాల వారికీ అడ్మిషన్లు
ఉత్తరాఖండ్‌లో ఇక మదర్సాలన్నీ నవీన రూపు సంతరించుకోనున్నాయి. మదర్సాల్లో భారీ మార్పులు చేయనున్నట్టు ఆ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ప్రకటించింది. మదర్సాలను ఆధునికీకరించడంతోపాటు విద్యాబోధనను కూడా మెరుగుపర్చాలని నిర్ణయం తీసుకున్నట్టు బోర్డు చైర్మన్ షాదాబ్ షామ్స్ తెలిపారు. మదర్సాలలో నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ (ఎన్సీఈఆర్టీ) సిలబస్‌ను ప్రవేశ పెడతామని, విద్యార్థుల డ్రెస్‌కోడ్‌లోనూ మార్పులు తీసుకొస్తామని పేర్కొన్నారు. అంతేకాదు, అన్ని మతాల వారికీ వాటిలో అడ్మిషన్లు ఇస్తామన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో 103 మదర్సాలు నడుస్తున్నాయి.
వచ్చే ఏడాది నుంచి మదర్సాలలో ఉదయం ఆరున్నర గంటల నుంచి ఏడున్నర వరకు గంట సమయం మాత్రమే మతపరమైన విద్యా బోధన ఉంటుందని, ఆ తర్వాతి నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు ఇతర పాఠశాలల్లో బోధిస్తున్నట్టుగానే సాధారణ సబ్జెక్టులను బోధిస్తామని షాదాబ్ పేర్కొన్నారు. అలాగే, డెహ్రాడూన్, హరిద్వార్, ఉధమ్‌సింగ్ నగర్లలో రెండేసి చొప్పున, నైనిటాల్లో ఒకటి మోడల్ మదర్సాలను ఏర్పాటు చేస్తామని వివరించారు. వాటిలో స్మార్ట్ క్లాసులు ఉంటాయన్నారు.
మదర్సాలను ఆధునిక విద్యా విధానానికి కేంద్రాలుగా మార్చాలనుకుంటున్నట్టు ఆయన చెప్పారు. మదర్సాలలో హఫీజ్-ఇ-ఖురాన్ బోధనను నాలుగేళ్ల నుంచి పదేళ్లకు పెంచాలని బోర్డు నిర్ణయించినట్టు తెలిపారు. అప్పటికి కోర్సు కూడా పూర్తయిపోతుందని, విద్యార్థులు 10 లేదంటే 12 తరగతులు పూర్తి చేసుకుంటారన్నారు. దీని వల్ల వారిలో పరిపక్వత పెరిగి ఆ తర్వాత వారు మతపరమైన విద్యా విధానాన్ని కొనసాగించాలా? లేదంటే డాక్టర్, ఇంజినీరింగ్ వైపు వెళ్లాలా? అనేది నిర్ణయించుకోగలుగుతారని షాదాబ్ వివరించారు.