Woman: సముద్రంలో పడిపోయినా.. భేషుగ్గా పనిచేస్తున్న ఐ ఫోన్
- ఇంగ్లండ్ లోని సముద్ర తీరంలో చోటు చేసుకున్న ఘటన
- తెడ్డుపై విన్యాసాల సమయంలో పడిపోయిన ఫోన్
- మూడు నెలల తర్వాత ఒడ్డున కనిపించిన ఫోన్
వాటర్ రెసిస్టెన్స్ ఉన్న ఫోన్లను వినియోగించడం వల్ల ఎంతటి రక్షణ ఉంటుందో ఈ ఉదంతం తెలియజేసింది. మనం వాడే ఫోన్లలో అధిక శాతం నీటిలో పడితే ఆశలు వదులుకోవాల్సిందే. కానీ, ఒక ఐఫోన్ సముద్రంలో పడిపోయినా, భేషుగ్గా పనిచేస్తోంది.
ఈ ఏడాది ఆగస్ట్ 4న ఇంగ్లండ్ లోని హవంత్ పట్టణ తీరంలో 39 ఏళ్ల క్లేర్ ఆట్ ఫీల్డ్ అనే మహిళ తెడ్డు బోర్డుపై సముద్రంలో విన్యాసం చేస్తున్న సమయంలో ఆమె ఐఫోన్ 8 సముద్రంలో పడిపోయింది. అలల రూపంలో ఒడ్డుకు వస్తుందని ఎదురు చూసినా, ఆమె ఆశ నెరవేరలేదు. దీంతో తన ఫోన్ పై ఆశలు వదిలేసుకుంది. కానీ, తీరంలో పెంపుడు శునకంతో వెళుతున్న ఓ వ్యక్తికి ఈ ఐఫోన్ కనిపించడంతో.. నవంబర్ 7న ఆ ఫోన్ తిరిగి ఆ మహిళను చేరుకుంది.
దాన్ని చూసి ఆమె ఎంతో ఆశ్చర్యపోయింది. ఫోన్ పై స్క్రాచెస్ కూడా పెద్దగా ఏమీ లేవు. అది కేస్ తో ఉండడం కలిసొచ్చింది. ఫోన్ చక్కగా పనిచేస్తోంది. సాధారణంగా ఆమె తెడ్డుపై విన్యాసాల సమయంలో ఐఫోన్ ను మెడలో వేసుకుంటుంది. అది సముద్రంలో పడిపోయిన రోజు కూడా అలానే ధరించింది. కానీ, తెడ్డు బోర్డుపై నుంచి ఆమె జారి సముద్రంలో పడిపోవడంతో మెడలోని ఐఫోన్ జారిపోయింది.