rupee: కనిపించకుండా పోతున్న పాత రూపాయి, అర్ధ రూపాయి నాణాలు
- 1990, 2000 కాలంలో విడుదల చేసినవి వెనక్కి
- బ్యాంకుల్లో డిపాజిట్ చేసినవి, అక్కడి నుంచి ఆర్ బీఐకి
- వీటి చెల్లుబాటు, చట్టబద్ధతకు ఢోకా లేదు
మీ దగ్గర పాత రూపాయి, అర్ధ రూపాయి (50 పైసలు) నాణాలు ఉన్నాయా? అవి కాపర్ నికెల్ కాయిన్లు అయి ఉంటే, ఇక మీదట వ్యవస్థలో కనిపించవు. కొన్ని రకాల కాయిన్లను తిరిగి ఇష్యూ చేయడం లేదంటూ ఐసీఐసీఐ బ్యాంకు ఢిల్లీ శాఖ ఒకటి నోటీసు బోర్డులో పెట్టింది. అంటే ఈ కాయిన్లను కస్టమర్లు డిపాజిట్ చేయొచ్చు. కానీ, వాటిని బ్యాంకు తిరిగి మరొకరికి ఇవ్వదు. బ్యాంకు శాఖల నుంచి ఈ కాయిన్లను ఆర్ బీఐ వెనక్కి తీసుకుంటోంది.
అలా అని ఈ కాయిన్లు చెల్లవేమోనన్న భయం అక్కర్లేదు. వీటికున్న చట్టబద్ధతను ఆర్ బీఐ రద్దు చేయలేదు. 1990, 2000 సంవత్సరాల కాలంలో వ్యవస్థలోకి విడుదల చేసిన కాయిన్లను ఇప్పుడు క్రమంగా ఆర్ బీఐ వెనక్కి తీసుకుంటోంది. కాపర్ నికెల్ తో చేసిన రూపాయి, 50 పైసలు, 25 పైసలు, స్టెయిన్ లెస్ స్టీల్ తో చేసిన 10 పైసల కాయిన్లు బ్యాంకులకు చేరగానే, వాటిని ఆర్ బీఐకి డిపాజిట్ చేస్తున్నాయి.
అలాగే, అల్యూమినియం కంచుతో తయారు చేసిన 10 పైసలు, అల్యూమినియం 20 పైసలు, అల్యూమినియం 10 పైసలు, అల్యూమినియం 5 పైసల కాయిన్లను కూడా వెనక్కి తీసుకుంటున్నారు. 25 పైసలు, అంతకు లోపు విలువతో కూడిన అన్ని రకాల కాయిన్లను వ్యవస్థ నుంచి (చలామణి) వెనక్కి తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం లోగడే నిర్ణయించింది. ఒక్కసారి ఈ కాయిన్లు మొత్తం వెనక్కి వచ్చిన తర్వాత వాటి చట్టబద్ధతను రద్దు చేయనుంది.