Toyota Innova: కొత్త రూపంలో టయోటా ఇన్నోవా.. జనవరి నుంచి డెలివరీ
- ఇన్నోవా హైక్రాస్ విడుదల
- రూ.50 వేలతో బుక్ చేసుకోవచ్చు
- డిజైన్ లో భారీ మార్పులు
వినియోగదారుల మనసు గెలిచిన కార్లలో ఇన్నోవా ఒకటి. ఏటా అధిక సంఖ్యలో అమ్ముడుపోయే టాప్-10 మోడళ్లలో టయోటా ఇన్నోవా తప్పకుండా ఉంటుంది. కొన్నేళ్ల క్రితం టయోటా ఇన్నోవా.. క్రిస్టా పేరుతో కొత్త ఫీచర్లతో వచ్చింది. ఇప్పుడు అదే ఇన్నోవా ‘హైక్రాస్’ పేరుతో మార్కెట్లోకి వచ్చింది.
హైక్రాస్.. ఇన్నోవా పూర్వపు మోడళ్లతో పోలిస్తే డిజైన్, ఫీచర్ల పరంగా ఎంతో కొత్తదనాన్ని సంతరించుకుంది. చూడ్డానికి పెద్ద సైజు ఎస్ యూవీ మాదిరి కనిపిస్తుంటుంది. మరింత సౌకర్యం, అత్యాధునిక టెక్నాలజీ ఫీచర్లతో వస్తుంది. ఈ వాహనం బుకింగ్ లు మొదలయ్యాయి. రూ.50వేల టోకెన్ అమౌంట్ తో బుక్ చేసుకోవచ్చు. జనవరి నుంచి డెలివరీ చేయనున్నట్టు టయోటా కిర్లోస్కర్ ప్రకటించింది. వీటి ధరలను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. రూ.20 లక్షల నుంచి ప్రారంభం కావచ్చని మార్కెట్ వర్గాల అంచనా.
ఇన్నోవా హైక్రాస్ రెండు పెట్రోల్, మూడు హైబ్రిడ్ వేరియంట్లలో లభిస్తుంది. ఇందులో డీజిల్ వేరియంట్ ఉండదు. కారు ముందు భాగంలో పెద్ద సైజు గ్రిల్ ఉంటుంది. డాష్ బోర్డ్ లే అవుట్ కూడా మారింది. వెనుక కూడా రిక్లైనింగ్ సీట్లను ఏర్పాటు చేశారు. దీంతో ఎంత దూరమైనా సౌకర్యంగా ప్రయాణించొచ్చు. ఏడు, ఎనిమిది సీట్ల లే అవుట్ తో, రూఫ్ లో ఏర్పాటు చేసిన ఏసీ వెంట్లతో ఉంటుంది.