Pawan Kalyan: ఈ నెల 27న ఇప్పటం బాధితులకు పవన్ కల్యాణ్ ఆర్థికసాయం
- ఇప్పటంలో ఇటీవల కూల్చివేతలు
- గ్రామంలో పర్యటించిన పవన్
- ఆర్థికసాయం చేస్తానని ప్రకటన
- కూల్చివేతతో నష్టపోయిన ప్రతి ఇంటికి రూ.1 లక్ష
- చెక్కులు పంపిణీ చేయనున్న జనసేనాని
ఇటీవల గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో పర్యటించిన జనసేనాని పవన్ కల్యాణ్ కూల్చివేతలతో నష్టపోయిన ప్రతి ఇంటికి రూ.1 లక్ష ఆర్థికసాయం ప్రకటించారు. ఈ నేపథ్యంలో, ఈ నెల 27న పవన్ కల్యాణ్ ఇప్పటం బాధితులకు ఆర్థికసాయం అందించనున్నారు. దీనిపై జనసేన పార్టీ ఓ ప్రకటన చేసింది.
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు వేదికగా నిలిచిన గ్రామం ఇప్పటం అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు. ఇప్పటం గ్రామ రైతులు జనసేన సభ ప్రాంగణం కోసం తమ పొలాలను ఇచ్చారని వెల్లడించారు. అయితే, రహదారి విస్తరణ పేరుతో ఇప్పటం గ్రామంలో కొన్ని ఇళ్లను కూల్చారని, ఆ సమయంలో గ్రామస్తులను కలుసుకున్న పవన్ వారి బాధల పట్ల చలించిపోయారని వివరించారు.
కూల్చివేతలతో నష్టపోయిన ప్రతి ఇంటికీ లక్ష రూపాయల ఆర్థికసాయాన్ని ప్రకటించారని, ఈ నేపథ్యంలో ఈ నెల 27న మంగళగిరిలోని జనసేన రాష్ట్ర కార్యాలయంలో పవన్ కల్యాణ్ స్వయంగా బాధితులకు చెక్కులు పంపిణీ చేస్తారని తెలిపారు.