Chandrababu: రాజకీయంగా తాము ఫినిష్ అని వైసీపీ నేతలకు ఇప్పటికే అర్థమయ్యింది: చంద్రబాబు
- నియోజకవర్గ ఇన్చార్జిలతో చంద్రబాబు భేటీ
- ప్రభుత్వంతో ప్రజలు విసిగిపోయారన్న టీడీపీ అధినేత
- తన పర్యటనలతో వైసీపీలో కలవరం కలుగుతోందని వ్యాఖ్య
- 'ఇదేం ఖర్మ'ను ముందుకు తీసుకెళ్లాలని సూచన
తమ ప్రభుత్వ వైఫల్యాల కారణంగా రాజకీయంగా తాము ఫినిష్ అయ్యామని వైసీపీ నేతలకు ఈపాటికే అర్థం అయిందని టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. పాలనలో వైఫల్యాలు, ప్రజా వ్యతిరేక నిర్ణయాల కారణంగా పార్టీ దారుణంగా దెబ్బతిన్నదన్న విషయం వైసీపీ నేతలకు బోధపడిందని తెలిపారు. విధ్వంసాలు, వ్యక్తులపై, ప్రతిపక్ష పార్టీలపై అణిచివేత దోరణి కూడా ప్రభుత్వానికి నష్టం చేసిందని చంద్రబాబు పేర్కొన్నారు.
అయితే రాజకీయ మనుగడ కోసం ముఖ్యమంత్రి సహా వైసీపీ నేతలు అంతా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని... లోపల మాత్రం ఓటమి భయం వారికి నిద్ర లేకుండా చేస్తోందని విమర్శించారు.
పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ లతో ముఖాముఖీ భేటీల్లో భాగంగా, చంద్రబాబు పలు అంశాలపై తన వద్ద ఉన్న ఫీడ్ బ్యాక్ ను వారితో పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అంగబలం, అర్థబలం సహా ఏదీ తమ ప్రభుత్వాన్ని రక్షించలేదనే వాస్తవాన్ని చాలా మంది వైసీపీ నేతలు గుర్తించారని చంద్రబాబు అన్నారు.
తన జిల్లా పర్యటనలకు వస్తున్న స్పందనతో వైసీపీలో కలవరపాటు మొదలైందని అన్నారు. వైసీపీ జిల్లా అధ్యక్షులను మార్చుకున్న పరిస్థితులపైనా చంద్రబాబు పార్టీ నేతలకు కారణాలు వివరించారు. అధికార పార్టీ బీసీ నేతల రేపటి సమావేశం కూడా వైసీపీలో మొదలైన ఆందోళనకు నిదర్శనం అని చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా ప్రభుత్వంపై నెగటివ్ టాక్ ఎందుకు వస్తుందనే విషయం అధికార పార్టీ నేతలకు కూడా తెలుసని చంద్రబాబు నేతలతో వ్యాఖ్యానించారు.
ప్రభుత్వం పోలీసులను పెట్టుకుని ప్రజలను సైతం అణిచివేసే ప్రయత్నం చేస్తున్నా, అన్ని చోట్లా నిలదీతలే ఎదురవుతున్నాయని చంద్రబాబు అన్నారు. చివరికి పులివెందులలో కూడా జగన్ రెడ్డికి ఎదురుగాలి మొదలైందని చంద్రబాబు అన్నారు.
కాగా, నేటితో 138 నియోజకవర్గాల ఇంచార్జ్ లతో చంద్రబాబు ముఖాముఖీ భేటీలు ముగిశాయి. గత మూడున్నరేళ్ల కాలంలో నియోజకవర్గ ఇంచార్జ్ పనితీరుపై భేటీల్లో భాగంగా సమీక్ష చేశారు. ప్రజల బాధలపై డిసెంబర్ 2 నుంచి పార్టీ తలపెట్టిన 'ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి' కార్యక్రమాన్ని ఇంటింటికీ వెళ్లి విస్తృతంగా చేపట్టాలని చంద్రబాబు పార్టీ నేతలకు పిలుపునిచ్చారు.
అందరితో సమన్వయం చేసుకుని ఇంచార్జ్ లు 'ఇదేం ఖర్మ' కార్యక్రమాన్ని నిర్వహించాలని సూచించారు. తాము నిర్వహించే కార్యక్రమాలపై ప్రతి రోజూ అప్డేట్స్ సోషల్ మీడియా అకౌంట్లలో ఉంచడం ద్వారా ప్రచారం కల్పించాలని కూడా చంద్రబాబు నేతలకు సూచించారు. క్షేత్రస్థాయిలో జరిగే ఈ కార్యక్రమాన్ని రోజువారీ మానిటర్ చేస్తామని తెలిపారు.
'బాదుడే బాదుడు' నిర్వహణ మంచి ఫలితాలు ఇచ్చిందని చెప్పిన చంద్రబాబు... 'ఇదేం ఖర్మ' మన రాష్ట్రానికి కార్యక్రమం ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను అన్నిచోట్లా చర్చకు తీసుకురావాలని అన్నారు.
నేతలు పార్టీ కార్యక్రమాల నిర్వహణలో వెనుకబడితే వారే నష్టపోతారని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నేడు జరిగిన పార్టీ సమీక్ష సమావేశంలో టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో పాటు ఎస్.కోట, నరసన్న పేట, పెడన ఇంచార్జ్ లు కోళ్ల లలిత కుమారి, బగ్గు రమణ మూర్తి, కాగిత కృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు.