Elon Musk: ట్విట్టర్ చేసిన ఘోరమైన తప్పు ఇది... సరిదిద్దుకుంటాం: ఎలాన్ మస్క్
- ఇటీవలే ట్రంప్ ట్విట్టర్ ఖాతాను పునరుద్ధరించిన మస్క్
- ఒక ఘోరమైన తప్పును సరిదిద్దుకున్నామన్న మస్క్
- అయినా ట్విట్టర్ కు దూరంగానే ఉన్న ట్రంప్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొలాల్డ్ ట్రంప్ ఖాతాను బ్యాన్ చేయడం ట్విట్టర్ చేసిన ఘోరమైన తప్పు అని ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ అన్నారు. ఈ తప్పును సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. 2021 జనవరి 6న అధ్యక్ష ఎన్నిక సందర్భంగా హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. క్యాపిటల్ భవనంలోకి ఆందోళనకారులు దూసుకెళ్లారు. వారిని రెచ్చగొట్టే విధంగా ట్రంప్ వ్యవహరించారని వార్తలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో ట్రంప్ ఖాతాను ట్విట్టర్ బ్యాన్ చేసింది. ఇటీవలే ట్రంప్ ఖాతాను ట్విట్టర్ పునరుద్ధరించింది. అయినప్పటికీ ట్విట్టర్ లోకి మళ్లీ అడుగు పెట్టే ప్రసక్తే లేదని ట్రంప్ స్పష్టం చేశారు. చెప్పినట్టుగానే ఆయన ఇంతవరకు మళ్లీ ట్వీట్ చేయలేదు.
ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్ స్పందిస్తూ... 'ట్రంప్ ట్వీట్లు చేయడం లేదు. అయినా పర్వాలేదు. ఒక ఘోరమైన తప్పును ట్విట్టర్ సరిదిద్దుకోవడమనేది చాలా ముఖ్యమైన విషయం. దేశాధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఖాతాను బ్యాన్ చేయడం ద్వారా అమెరికాలోని సగం మంది ప్రజల విశ్వాసాన్ని ట్విట్టర్ కోల్పోయింది. ట్రంప్ చట్ట వ్యతిరేక పనులు చేయలేదు' అని అన్నారు. తప్పును సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు.