Vande Bharat trains: 300-400 వందే భారత్ రైళ్లు.. బడ్జెట్ లో ప్రకటన
- రైళ్ల డిజైన్ లో మార్పులు
- స్టాండర్డ్ గేజ్ కు అనుకూలంగా రైళ్ల తయారీ
- 2024 మొదట్లో వందేభారత్ స్లీపర్ రైలు
దేశ ప్రజలందరికీ వందే భారత్ రైళ్లలో ప్రయాణించే వెసులుబాటు కలగనుంది. వచ్చే బడ్జెట్ లో 300 నుంచి 400 వరకు వందే భారత్ రైళ్లపై ప్రకటన చేయవచ్చని తెలుస్తోంది. 3-4 ఏళ్లలో 475 వందే భారత్ రైళ్లను పట్టాలెక్కించనున్నట్టు కేంద్ర సర్కారు లోగడే ప్రకటించింది. ఇప్పుడు వీటికి అదనంగా మరిన్ని వందేభారత్ రైళ్లపై ప్రకటన చేయవచ్చని అధికార వర్గాలను ఉటంకిస్తూ సమాచారం బయటకు వచ్చింది.
వందే భారత్ రైళ్లు ప్రస్తుత రైళ్లతో పోలిస్తే వేగంగా ప్రయాణిస్తాయన్న విషయం తెలిసిందే. వీటిని సెమీ హైస్పీడ్ రైళ్లుగా పిలుస్తున్నారు. గంటకు 180 కిలోమీటర్ల వేగంతో వెళ్లే సామర్థ్యం వీటి సొంతం. అయితే ప్రస్తుతం 130 కిలోమీటర్లకే వేగాన్ని పరిమితం చేస్తున్నారు. ప్రస్తుత రైల్వే ట్రాక్ లపై వీటిని వేగంగా నడిపించేలా డిజైన్ లోనూ మార్పులు చేయనున్నారు.
మొదటి స్లీపర్ కోచ్ వందే భారత్ రైలు 2024 మొదటి మూడు నెలల్లో ప్రారంభం అవుతుందని రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ తెలిపారు. ప్రస్తుతం వందే భారత్ రైళ్లను బ్రాడ్ గేజ్ నెట్ వర్క్ కు అనుగుణంగా తయారు చేస్తుండగా.. వచ్చే ఏడాదిలో స్టాండర్డ్ గేజ్ కు అనుగుణంగా తయారీ మొదలవుతుందని తెలిపారు. స్టాండర్డ్ గేజ్ అయితే అధిక వేగంతో రైళ్లు ప్రయాణించేందుకు అనుకూలంగా ఉంటుంది. 220 కిలోమీటర్ల (గంటకు) వేగంతో వెళ్లేందుకు అనుకూలంగా రాజస్థాన్ లో ఒక టెస్ట్ ట్రాక్ ను ఏర్పాటు చేసినట్టు అశ్వని వైష్ణవ్ వెల్లడించారు.