Amaravati: తుళ్లూరులో అమరావతి రైతుల సమావేశం... ఉద్యమాన్ని జాతీయస్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయం
- వైసీపీ అధికారంలోకి వచ్చాక అమరావతిపై అనిశ్చితి
- మూడు రాజధానులపై సర్కారు మక్కువ
- ఉద్యమం బాటపట్టిన అమరావతి రైతులు
- డిసెంబరు 17కి మూడేళ్లు పూర్తిచేసుకోనున్న ఉద్యమం
ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక రాజధాని అమరావతిపై అనిశ్చితి ఏర్పడడం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానుల నినాదం ఎత్తుకోవడంతో, అమరావతి కోసం భూములు ఇచ్చిన రైతులు ఉద్యమం బాటపట్టారు. ఈ ఉద్యమానికి డిసెంబరు 17తో మూడేళ్లు పూర్తికానున్నాయి.
ఈ నేపథ్యంలో, అమరావతి రైతులు నేడు తుళ్లూరులో సమావేశం అయ్యారు. అమరావతి ఉద్యమాన్ని జాతీయస్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. ఉద్యమానికి మూడేళ్లు పూర్తయిన సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో నిరసన కార్యక్రమం నిర్వహించాలని తీర్మానించారు.
రాజధానికి సంబంధించిన కేసు సుప్రీంకోర్టులో ఉన్నందున ఢిల్లీలో ప్రదర్శన చేపట్టాలని నిశ్చయించారు. సుప్రీంకోర్టులో తుది తీర్పు వచ్చేంతవరకు ఉద్యమం కొనసాగించాలని నేటి సమావేశంలో రైతులు నిర్ణయించారు.