Pawan Kalyan: గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్న పవన్ కల్యాణ్... రేపు ఇప్పటం రైతులకు ఆర్థికసాయం
- ఇటీవల ఇప్పటం గ్రామంలో కూల్చివేతలు
- నష్టపోయిన ప్రతి ఇంటికి రూ.1 లక్ష ఇవ్వాలని పవన్ నిర్ణయం
- రేపు చెక్కులు పంపిణీ చేయనున్న పవన్
గుంటూరు జిల్లా ఇప్పటం గ్రామంలో కూల్చివేతల కారణంగా నష్టపోయిన వారికి జనసేనాని పవన్ కల్యాణ్ రేపు (నవంబరు 27) ఆర్థికసాయం అందించనున్నారు. ఈ నేపథ్యంలో, పవన్ కల్యాణ్ ఈ సాయంత్రం గన్నవరం ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. విమానాశ్రయం వద్ద జనసేన వర్గాలు ఆయనకు స్వాగతం పలికాయి. పవన్ ఎయిర్ పోర్టు నుంచి నేరుగా మంగళగిరిలోని జనసేన ప్రధాన కార్యాలయానికి పయనమయ్యారు.
ఇప్పటం గ్రామంలో ఇటీవల రహదారి విస్తరణలో భాగంగా అధికారులు పలు కూల్చివేతలు చేపట్టారు. అయితే, జనసేన సభ ప్రాంగణానికి భూములు ఇచ్చిన కారణంగానే ఇప్పటం గ్రామస్తులపై ప్రభుత్వం కక్ష సాధిస్తోందని జనసేన ఆరోపిస్తోంది. అందులో భాగంగానే కూల్చివేతలకు పాల్పడ్డారని మండిపడుతోంది.
ఈ నేపథ్యంలో, కూల్చివేతలతో నష్టపోయిన ప్రతి ఇంటికి రూ.1 లక్ష ఆర్థికసాయం అందిస్తామని పవన్ ప్రకటించారు. రేపు ఇప్పటం రైతులకు పవన్ చెక్కులు పంపిణీ చేస్తారు.