Vitamin B12: బీ 12 విటమిన్ కొరతతో అనారోగ్యం
- కావాల్సింది తక్కువే అయినా అత్యవసరం..
- నీరసం, గందరగోళం, జ్ఞాపకశక్తి లోపం తదితర సమస్యలు
- పాలు, పాల పదార్థాలతో పాటు పండ్లు, మాంసంలో పుష్కలంగా దొరుకుతుంది
- వెల్లడించిన అమెరికా పరిశోధకులు
మన శరీరానికి అత్యవసరమైన విటమిన్లలో బీ 12 ఒకటి.. అతి తక్కువ మోతాదు మాత్రమే అవసరమైనా, అది లేకపోతే మాత్రం అనారోగ్య సమస్యలు చుట్టుముడతాయని అమెరికా పరిశోధకులు హెచ్చరిస్తున్నారు. వైద్యులు కూడా బీ 12 విటమిన్ లోపంపై అశ్రద్ధ వహిస్తున్నారని అమెరికాలోని వేన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు ఆందోళన వ్యక్తం చేశారు. శాఖాహారంలో, మాంసాహారంలోనూ లభ్యమయ్యే ఈ విటమిన్ శరీరానికి ఎంతో అవసరమని వివరించారు.
రోజూ శరీరానికి కావాల్సిన పరిమాణం..?
తాజా పరిశోధనల ప్రకారం.. రోజూ 2.4 మైక్రోగ్రాముల బీ 12 విటమిన్ శరీరానికి అవసరం. ఇది చాలా చిన్న మొత్తమే కానీ ఈ మాత్రం కూడా ప్రస్తుతం చాలామందికి అందట్లేదని పరిశోధకులు చెబుతున్నారు. ఈ విటమిన్ లోపంతో జీవన నాణ్యత దెబ్బతింటుందని పేర్కొన్నారు. నీరసం, గందరగోళం, జ్ఞాపకశక్తి లోపించడం, నిరాశ తదితర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.
లోపం ఎలా ఏర్పడుతుంది?
ఆహారంతో పాటు జీర్ణవ్యవస్థలోకి చేరే బీ 12 విటమిన్ ను రక్తంలోకి చేర్చడానికి లాలాజలంలోని ఆర్ ప్రొటీన్ చాలా కీలకమని పరిశోధకులు చెబుతున్నారు. పొట్టలో ఆమ్లాలు ఆహారాన్ని, బీ 12 విటమిన్లను వేరు చేస్తాయి. క్లోమగ్రంథులు ఆర్-ప్రొటీన్ నుంచి బీ 12ను వేరు చేసి కణాలు విటమిన్లను అందుకునేందుకు దోహదపడతాయి. అక్కడి నుంచి ఈ విటమిన్లు నరాల వ్యవస్థకు, ఆరోగ్యమైన ఎర్రరక్త కణాలకు చేరతాయి. ఈ మొత్తం ప్రక్రియలో ఎక్కడో ఒకచోట అంతరాయం ఏర్పడి, విటమిన్లు శరీరానికి అందకపోవడమే బీ 12 లోపంగా పేర్కొంటాం.
బీ 12 ఎందులో ఉంటుంది..
ఆపిల్, అరటి పండు, బ్లూ బెర్రీ, ఆరెంజ్ వంటి పండ్లలో విటమిన్ బీ 12 పుష్కలంగా ఉంటుంది. పాలు, పాల పదార్థాలలోనూ విరివిగా లభిస్తుంది. మాంసాహారంలోనూ లివర్, కిడ్నీ, టూనా, సాల్మన్ వంటి చేపల్లోనూ విటమిన్ బీ 12 సప్లిమెంట్ ఎక్కువగా ఉంటుందని వైద్యులు పేర్కొన్నారు.