ippatam: ఇప్పటం గ్రామంలో ఇళ్లు కూల్చడం బాధించింది: పవన్ కల్యాణ్
- గ్రామస్థులకు అండగా ఉంటానన్న జనసేనాని
- ఇళ్ల కూల్చివేత బాధితులకు రూ.లక్ష చొప్పున చెక్కులు అందజేత
- ఇప్పటం గ్రామస్థుల తెగువ నచ్చిందన్న పవన్ కల్యాణ్
- అమరావతి రైతులు కూడా ఇదే తెగువ చూపించాల్సిందని వ్యాఖ్య
ఇప్పటంలో ఇళ్ల కూల్చివేతలో పద్ధతి పాటించలేదని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పేర్కొన్నారు. పరిహారం ఇవ్వకుండా ఇళ్లను కూల్చివేయడం తనను బాధించిందని ఆయన చెప్పారు. ఇప్పటం గ్రామస్థులు జనసేనకు అండగా ఉన్నారనే కక్షతోనే ఇళ్లను కూల్చివేశారని పవన్ మండిపడ్దారు. ఆదివారం ఇప్పటం చేరుకున్న పవన్ కల్యాణ్ కూల్చివేతల బాధితులను ఉద్దేశించి మాట్లాడారు. బాధితులు ఒక్కొక్కరికీ జనసేన తరఫున రూ.లక్ష చొప్పున పరిహారం చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. తనకు అండగా ఉన్న ఇప్పటం గ్రామస్థులకు తాను అండగా నిలుచుంటానని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలపై పవన్ మండిపడ్డారు. వైసీపీ గడప కూల్చేదాకా విశ్రమించబోమని తేల్చిచెప్పారు. ఇప్పటం గ్రామస్థుల తెగువ నచ్చిందన్న పవన్.. అమరావతి రైతులు ఇదే తెగువ చూపించాల్సిందని పేర్కొన్నారు. ప్రజలు, రైతుల ఇళ్లు, భూములను తగిన పరిహారం ఇవ్వకుండా ప్రభుత్వం లాగేసుకోవడం బాధాకరమని, ఈ విషయం తనను బాధిస్తోందని పవన్ కల్యాణ్ చెప్పారు.