Pawan Kalyan: రౌడీ సేన కాదు.. మాది విప్లవ సేన: పవన్ కల్యాణ్
- జనానికి అన్యాయం జరిగితే రోడ్డుమీదికొచ్చానని వ్యాఖ్య
- ప్రజల దృష్టిలో జనసైనికులు విప్లవకారులంటూ వివరణ
- వచ్చే ఎన్నికల్లో నాకు ఓటేసినా.. వేయకున్నా సరే.. ఇప్పటం గ్రామానికి అండగా ఉంటానని పవన్ కల్యాణ్ వెల్లడి
సాటి ప్రజలకు, జనాలకు అన్యాయం జరుగుతుంటే తాను రోడ్లపైకి వచ్చానని పవన్ కల్యాణ్ చెప్పారు. ఓ పద్ధతి పాడూ లేకుండా, అన్యాయంగా ఇళ్లు కూల్చివేస్తుంటే ప్రశ్నించేందుకు వచ్చానని వివరించారు. అన్యాయం తన గడప తొక్కే వరకూ వేచి ఉండలేదని, అలా తాను ఉండలేనని స్పష్టం చేశారు. జనసేనను రౌడీ సేన అంటున్న వైసీపీ నేతలకూ పవన్ కౌంటర్ ఇచ్చారు. తమది రౌడీ సేన కాదని.. విప్లవ సేన అని చెప్పారు.
రౌడీయిజం చేసేవాళ్లకు, గుండాయిజం చేసేవాళ్లకు ఎదురు తిరగడం రౌడీయిజమేనని వైసీపీ నేతలు భావిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ నేతల వంటి దౌర్జన్యాలు చేసే వారికి రౌడీలుగా కనిపిస్తే తమకు అభ్యంతరంలేదని పవన్ కల్యాణ్ చెప్పారు. కానీ ప్రజల దృష్టిలో మాత్రం జనసైనికులు విప్లవకారులని పవన్ కల్యాణ్ వివరించారు.
వచ్చే ఎన్నికల్లో మీరు నాకు ఓటేస్తారో లేదో తెలియదు.. మీరు నాకు ఓటేసినా వేయకపోయినా ఇప్పటం గ్రామానికి, గ్రామస్థులకు ఎల్లప్పుడూ తాను అండగా ఉంటానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారు.
చెట్లు చేమలు అంతరించాకా.. ఆఖరి నీటి బొట్టూ కలుషితమయ్యాక.. పీల్చే గాలి పూర్తిగా కలుషితమయ్యాక.. అప్పుడు నోట్ల కట్టలను తినలేమని, వేల కోట్లతో శ్వాసించలేమని వైసీపీ నేతలకు తెలిసొస్తుందని పవన్ వ్యాఖ్యానించారు.