Haryana: సర్పంచ్ ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతో ఓడిన అభ్యర్థి.. బహుమతిగా రూ. 11 లక్షలు, కారు, భూమి!
- హర్యానాలో పంచాయతీ ఎన్నికల్లో ఘటన
- ఓడిపోయిన అభ్యర్థిని సన్మానించిన గ్రామస్థులు
- మరో గ్రామంలో గెలిచిన అభ్యర్థికి రూ. 11 లక్షల గజమాలతో సత్కారం
సర్పంచ్ ఎన్నికల్లో ఒక్క ఓటు తేడాతో ఓటమి పాలైన అభ్యర్థికి జాక్‌పాట్ తగిలింది. గ్రామస్థులందరూ కలిసి ఆయనకు రూ. 11 లక్షల నగదుతోపాటు ఓ కారు, కొంత భూమి బహుమతిగా అందించారు. హర్యానాలో జరిగిందీ ఘటన. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఫతేహాబాద్‌లోని నధోడి గ్రామంలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. మొత్తం 4,416 ఓట్లు పోలయ్యాయి. వీటిలో సుందర్ అనే అభ్యర్థికి 2,200 ఓట్లు, నరేందర్ అనే మరో అభ్యర్థికి 2,201 ఓట్లు వచ్చాయి.
దీంతో సుందర్ ఒక్క ఓటు తేడాతో ఓటమి పాలయ్యాడు. అయితే, ఓడిపోయిన సుందర్‌కు గ్రామస్థులు అదిరిపోయే ట్రీట్ ఇచ్చారు. ఆయనకు రూ.11,11,000 నగదు, ఓ స్విఫ్ట్ డిజైర్ కారు, కొంత భూమిని బహుమతిగా ఇచ్చారు. అలాగే, ఫరీదాబాద్ జిల్లాలోని ఫతేపూర్ తాగా గ్రామానికి కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌ను కూడా స్థానికులు ఇలాగే గొప్పగా సన్మానించారు. రూ. 11 లక్షల విలువైన రూ. 500 నోట్లతో గజమాల తయారు చేసి దానితో ఆయనను సన్మానించారు.