KCR: నేడు వీర్లపాలెం గ్రామానికి వెళ్తున్న కేసీఆర్

KCR to visti Yadadri Thermal Plant today

  • యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణ పనులను పరిశీలించనున్న సీఎం
  • అధికారులకు కీలక సూచనలు చేయనున్న కేసీఆర్
  • రూ. 29,992 కోట్లతో నిర్మితమవుతున్న విద్యుత్ ప్లాంట్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నేడు నల్గొండ జిల్లా దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ను సందర్శించనున్నారు. ప్లాంట్ నిర్మాణం పనులను పరిశీలించడమే కాకుండా అధికారులకు కీలక సూచనలను చేయనున్నారు. ఈ ఉదయం 11 గంటలకు ఆయన ప్రగతి భవన్ నుంచి బయల్దేరి బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయల్దేరి మధ్యాహ్నం 12 గంటలకు వీర్లపాలెంకు చేరుకుంటారు. ప్లాంట్ పనులను పరిశీలించిన తర్వాత ఆయన పనుల పురోగతిపై అధికారులతో సమీక్షను నిర్వహిస్తారు. 

కేసీఆర్ వెంట విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు, తెలంగాణ జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు తదితరులు రానున్నారు. సీఎం రాక నేపథ్యంలో వీర్లపాలెంలో జిల్లా అధికారులు హెలిపాడ్ ను సిద్ధం చేశారు. మరోవైపు, దేశంలోనే అతిపెద్ద థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని నిర్మించాలని భావించిన ప్రభుత్వం.... దీని నిర్మాణం కోసం నేషనల్ హైవే, రైల్వే, నీటి సౌకర్యం ఉన్న వీర్లపాలెం గ్రామాన్ని ఎంపిక చేసింది. 

ఈ ప్లాంట్ ను రూ. 29,992 కోట్లతో నిర్మిస్తున్నారు. ఐదు ప్లాంట్ల ద్వారా 800 మెగావాట్ల విద్యుత్ ను ఇక్కడ ఉత్పత్తి చేయనున్నారు. ఈ ప్లాంట్ కోసం 4,676 ఎకరాల భూమిని సేకరించి జెన్ కోకు అప్పగించారు. ఇప్పటికే 60 శాతం పనులు పూర్తయ్యాయి. ఐదు ప్లాంట్లలో రెండు ప్లాంట్లలో 2023 నాటికి విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అదే ఏడాది డిసెంబర్ నాటికి మరో ప్లాంటును.. 2024లో మిగిలిన రెండు ప్లాంట్లను పూర్తి చేసి పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తిని ప్రారంభించాలని జెన్ కో నిర్ణయించింది.

  • Loading...

More Telugu News