Ch Malla Reddy: ఐటీ విచారణకు మంత్రి మల్లారెడ్డి దూరం
- మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై ఐటీ దాడులు
- ఈరోజున విచారణకు హాజరు కావాల్సిన వైనం
- తన తరపున తన ఆడిటర్ హాజరవుతారన్న మల్లారెడ్డి
మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబ సభ్యులపై జరిగిన ఐటీ దాడులు కలకలం రేపిన సంగతి తెలిసిందే. ఈ దాడుల్లో పెద్ద మొత్తంలో నగదును అధికారులు సీజ్ చేశారు. కీలక డాక్యుమెంట్లను కూడా వారు స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. మరోవైపు ఈరోజు (నవంబర్ 28) నుంచి తమ ముందు విచారణకు హాజరుకావాలని మల్లారెడ్డి సహా 16 మందికి ఐటీ అధికారులు నోటీసులు జారీ చేశారు. ఐటీ నోటీసులు అందుకున్న వారిలో మల్లారెడ్డి, మహేందర్ రెడ్డి, భద్రారెడ్డి, కీర్తి రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, శ్రేయారెడ్డి, ప్రవీణ్ రెడ్డి, సంతోష్ రెడ్డి, త్రిశూల్ రెడ్డి, నర్సంహ యాద్, జైకిషన్, రాజేశ్వర్ రావు, ఇద్దరు ప్రిన్సిపాల్స్ తదితరులు ఉన్నారు. మూడు రోజుల పాటు వీరిని ఐటీ అధికారులు విచారించనున్నారు.
మరోవైపు విచారణకు మల్లారెడ్డి హాజరు కావడం లేదు. తన తరపున తన ఆడిటర్ విచారణకు హాజరవుతారని ఆయన తెలిపారు. ఉప్పల్ లో జరగనున్న పలు కార్యక్రమాల్లో తాను పాల్గొనాల్సి ఉందని... అందుకే విచారణకు వెళ్లలేకపోతున్నానని చెప్పారు. నోటీసులు అందుకున్న ఇతరులంతా విచారణకు హాజరవుతారని తెలిపారు. మరోవైపు, విచారణ నేపథ్యంలో ఐటీ కార్యాలయం వద్ద భారీ భద్రతను ఏర్పాటు చేశారు.