Twitter: ట్విట్టర్ లో పెరగనున్న ట్వీట్ సైజు
- ప్రస్తుతం ఒక ట్వీట్ లో 280 క్యారెక్టర్లకు అనుమతి
- దీన్ని 420కు పెంచాలంటూ ఓ యూజర్ ట్వీట్
- మంచి ఆలోచన అంటూ బదులిచ్చిన ఎలాన్ మస్క్
పొట్టి సందేశాల వేదిక ట్విట్టర్ కు అంత పాప్యులారిటీ వచ్చింది.. ఆ పొట్టి సందేశాల వల్లేనని చెప్పుకోవాలి. అలాంటి ట్విట్టర్ ప్లాట్ ఫామ్ కొత్త యజమాని ఎలాన్ మస్క్ సారథ్యంలో ఎన్నో మార్పులను సంతరించుకుంటోంది. ట్విట్టర్ ను మరింత చురుకైన, మెరుగైన వేదికగా మార్చాలన్నది మస్క్ ప్రయత్నం. అందులో భాగంగా ట్వీట్ లో అక్షరాల పరిమితిని పెంచనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఒక ట్వీట్ లో 280 క్యారెక్టర్ల వరకు ఉండొచ్చు. ఈ పరిమితిని 420కు పెంచే అవకాశం ఉంది. దీనివల్ల యూజర్లు తమ భావాలను మరింత వివరంగా చెప్పే వీలు కలుగుతుంది.
‘‘ట్విట్టర్ 2.0 (మస్క్ వచ్చిన తర్వాత) తప్పకుండా క్యారెక్టర్ల పరిమితిని 280కు బదులు 420 చేయాలి’’ అంటూ ఓ ట్విట్టర్ యూజర్ కోరగా.. మంచి ఆలోచన అంటూ దీనికి మస్క్ బుదలివ్వడం త్వరలో దీని సాకారాన్ని తెలియజేస్తోంది. ఆరంభంలో ట్విట్టర్ 140 క్యారెక్టర్లనే ఒక ట్వీట్ లో అనుమతించింది. 2018లో దీన్ని 280 క్యారెక్టర్లకు పెంచింది. ఇక సస్పెండ్ అయిన ట్విట్టర్ ఖాతాలకు మస్క్ సాధారణ క్షమాభిక్షను వచ్చే వారంలో ప్రకటించనున్నారు. దీంతో సెలబ్రిటీలు కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలి చందేల్, గాయకుడు అభిజీత్ బెనర్జీ తదితరులు మళ్లీ ట్విట్టర్ పైకి వచ్చే అవకాశం కలుగుతుంది.