Covid vaccine: కరోనా టీకాతో మరణిస్తే బాధ్యత మాది కాదు: కేంద్రం
- ఇద్దరు యువతుల మరణ కేసులో అఫిడవిట్ దాఖలు
- కరోనా వల్ల నష్టపోతే సివిల్ కోర్టును ఆశ్రయించొచ్చు
- 219 కోట్ల టీకా డోసులకు 92వేల మందిలోనే దుష్ప్రభావాలు
కరోనా రక్షక టీకా తీసుకున్న తర్వాత ఏవైనా తీవ్ర దుష్ప్రభావాలు ఎదురైతే అందుకు తమ బాధ్యత ఉండబోదని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కరోనా టీకా తీసుకున్న వ్యక్తి మరణించినట్టయితే సివిల్ కోర్ట్ లో పిటిషన్ దాఖలు చేసి పరిహారం కోరడమే మార్గమని పేర్కొంది. ఈ మేరకు అఫిడవిట్ దాఖలు చేసింది.
గతేడాది కరోనా టీకా తీసుకున్న అనంతరం ఇద్దరు వేర్వేరు యువతులు మరణించారు. దీంతో వారి తల్లిదండ్రులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనికి స్పందనగా కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ వేసింది. కరోనా టీకాలు తీసుకున్న అనంతరం చోటు చేసుకున్న మరణాలపై స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని పిటిషనర్లు కోరారు. టీకాలు తీసుకున్న తర్వాత తీవ్ర దుష్ప్రభావాలు ఎదురైతే వెంటనే గుర్తించి సత్వర చికిత్స అందించే ప్రోటోకాల్ కోసం డిమాండ్ చేశారు.
ఇద్దరు యువతుల మరణాలపై కేంద్రం సంతాపం వ్యక్తం చేసింది. ఈ మరణాలు కరోనా టీకాల వల్లేనని ఈ ఒక్క కేసులోనే నేషనల్ ఏఈఎఫ్ఐ కమిటీ గుర్తించినట్టు పేర్కొంది. జరిగిన నష్టంపై సివిల్ కోర్టును ఆశ్రయించి, పరిహారం కోరే హక్కు ఉంటుందని స్పష్టం చేసింది. 2022 నవంబర్ 19 నాటికి 219.86 కోట్ల కరోనా టీకా డోసులు ఇవ్వగా, 92,114 కేసుల్లో దుష్ప్రభావాలు కనిపించినట్టు తెలిపింది. ఇందులో 89,332 కేసులు స్వల్ప స్థాయివేనని వివరించింది. 2,782 కేసుల్లో తీవ్ర దుష్ప్రభావాలు తలెత్తాయని తెలిపింది.