- మెడికల్ ఆఫీసర్లుగా ఉస్మానియా ఆసుపత్రిలో నియామకం
- వైద్య విద్య చదివినా ఉద్యోగానికి ప్రైవేటు ఆసుపత్రుల నిరాకరణ
- పట్టుదలతో ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన వైనం
ట్రాన్స్ జెండర్లు చరిత్ర సృష్టించారు. తెలంగాణలో ఇద్దరు ట్రాన్స్ జెండర్లు (లింగ మార్పిడి చేయించుకున్న వారు) ప్రభుత్వ వైద్యులుగా ఎంపికయ్యారు. ప్రాచి రాథోడ్, కొయ్యల రుత్ జాన్ పాల్ మెడికల్ ఆఫీసర్లుగా ఎంపికై, ఉస్మానియా జనరల్ హాస్పిటల్ లో నియమితులయ్యారు. ప్రభుత్వరంగంలో వైద్యులుగా వీరి నియామకం ట్రాన్స్ జెండర్ కమ్యూనిటీకి సానుకూలమని భావిస్తున్నారు.
‘‘ఇది నిజంగా నాకు, ట్రాన్స్ జెండర్ల కమ్యూనిటీకి గొప్ప రోజు. 2018లోనే వైద్య విద్య పూర్తయింది. 15 హాస్పిటల్స్ లో ఉద్యోగం కోసం తిరిగాను. కానీ నన్ను తిరస్కరించారు. అందుకు కారణం చెప్పకపోయినా నేను అర్థం చేసుకున్నాను’’ అని ఖమ్మం పట్టణానికి చెందిన డాక్టర్ రుత్ తెలిపారు. మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లో ఆమె ఎంబీబీఎస్ చదివింది.
డాక్టర్ ప్రాచీ ఆదిలాబాద్ రిమ్స్ లో ఎంబీబీఎస్ పూర్తి చేసుకుంది. తాను ట్రాన్స్ జెండర్ అని తెలిసిన తర్వాత ఉద్యోగం నుంచి వెళ్లిపోవాలని ఓ ప్రైవేటు హాస్పిటల్ కోరినట్టు ప్రాచీ చెప్పారు. తన గుర్తింపును చూసి రోగులు వచ్చేందుకు వెనుకాడతారని చెప్పినట్టు 30 ఏళ్ల డాక్టర్ ప్రాచి మీడియాకు వెల్లడించారు. ‘‘మమ్మల్ని రోగులు వివక్షతో చూడొచ్చు. కానీ, ఒక్కసారి మేము వారికి చికిత్స అందించి, వారికి మెరుగైతే.. వారు ఇతరులను సైతం మా దగ్గరకు సిఫారసు చేస్తారు’’ అని డాక్టర్ రుత్ తెలిపారు. వీరు నీట్ పీజీ ఎంట్రన్స్ రాసినా ట్రాన్స్ జెండర్ కేటగిరీలో రిజర్వేషన్ ను కల్పించలేదని చెబుతున్నారు. దీనిపై అవసరమైతే న్యాయపోరాటం చేస్తామని తెలిపారు.