Andhra Pradesh: ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు పిటిషన్ ను కొట్టేసిన హైకోర్టు
- రెండేళ్లకు పైగా సస్పెన్షన్ లో ఉన్న ఏబీవీ
- జీతభత్యాల విడుదలపై సుప్రీంకోర్టు ఆదేశాలు అమలు కావడం లేదన్న సీనియర్ ఐపీఎస్
- సీఎస్ పై కోర్టు ధిక్కరణ కింద చర్యలు చేపట్టాలని పిటిషన్
ఏపీ కేడర్ కు చెందిన సీనియర్ ఐపీఎస్ అధికారి, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు మంగళవారం ఏపీ హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సమీర్ శర్మపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టాలన్న ఏబీవీ వినతిని హైకోర్టు తిరస్కరించింది. ఈ మేరకు ఏబీవీ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.
టీడీపీ హయాంలో నిఘా పరికరాల కొనుగోలులో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణల కింద వైసీపీ ప్రభుత్వం ఏబీవీపై సస్పెన్షన్ వేటు వేసిన సంగతి తెలిసిందే. తనపై విధించిన సస్పెన్షన్ రెండేళ్ల పరిమితి దాటిన తర్వాత న్యాయపోరాటం మొదలెట్టిన ఏబీవీ... సుప్రీంకోర్టును ఆశ్రయించి విజయం దక్కించుకున్నారు. ఏబీవీని తక్షణమే విధుల్లో చేర్చుకోవాలని, సస్పెన్షన్ పరిమితి కాలం ముగిసిన తర్వాత ఆయనకు జీత భత్యాలు ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో కోర్టు ఆదేశాలను అమలు చేయాలని కోరుతూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మను కలిసేందుకు ఏబీవీ పలుమార్లు సచివాలయానికి వెళ్లారు. అయితే సమీర్ శర్మ పెద్దగా స్పందించలేదు. అంతేకాకుండా తనకు సీఎస్ అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదని, కార్యాలయానికి వెళ్లినా తనను కలిసేందుకు సీఎస్ విముఖత వ్యక్తం చేస్తున్నారని గతంలో ఏబీవీ ఆరోపించిన సంగతి తెలిసిందే. కోర్టు ఇచ్చిన ఆదేశాలను కూడా అమలు చేయడం లేదంటూ సీఎస్ పై ఏబీవీ కోర్టు ధిక్కరణ ఆరోపణలతో పిటిషన్ వేశారు.