Andhra Pradesh: సమీర్ శర్మ, విజయ్ కుమార్ లకు కొత్త పదవులు ఇచ్చిన జగన్.... వివరాలు ఇవిగో
- రేపు పదవీ విరమణ చేయనున్న సమీర్ శర్మ, విజయ్ కుమార్
- సీఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా సమీర్ శర్మ నియామకం
- స్టేట్ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ సీఈఓగా విజయ్ కుమార్
- ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
రేపు (నవంబర్ 30) పదవీ విరమణ చేయనున్న ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మతో పాటుగా మరో ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ లకు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బంపర్ ఆఫర్ ఇచ్చారు. సీఎస్ గా పదవీ విరమణ చేసిన మరుక్షణమే సమీర్ శర్మ ముఖ్యమంత్రి కార్యాలయం (సీఎంఓ)లో కీలక బాధ్యతలను చేపట్టనున్నారు. ఐఏఎస్ అధికారిగా పదవీ విరమణ చేసిన తర్వాత సమీర్ శర్మను ఎక్స్ అఫీసియో చీఫ్ సెక్రటరీగా నియమించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఎక్స్ అఫీసియో చీఫ్ సెక్రటరీ హోదాలో సమీర్ శర్మ... సీఎం చీఫ్ ఎగ్జిక్యూటివ్ గా నియమితులు కానున్నారు. ఈ మేరకు సీఎంఓలో సమీర్ శర్మ కోసం ఓ ప్రత్యేక పోస్టును రాష్ట్ర ప్రభుత్వం సృష్టించింది.
ఇదిలా ఉంటే... రేపు పదవీ విరమణ చేయనున్న మరో సీనియర్ ఐఏఎస్ అధికారి విజయ్ కుమార్ కు కూడా సీఎం జగన్ బంపర్ ఆపర్ ఇచ్చారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక పలు కీలక బాధ్యతలు నిర్వర్తించిన విజయ్ కుమార్.. జిల్లాల పునర్విభజనను సమర్థవంతంగా పూర్తి చేశారు. ఈ క్రమంలో రేపు పదవీ విరమణ చేయనున్న విజయ్ కుమార్ కోసం రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పోస్టును సృష్టించింది. స్టేట్ డెవలప్ మెంట్ ప్లానింగ్ సొసైటీ సీఈఓగా విజయ్ కుమార్ ను నియమిస్తూ మంగళవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రణాళికా విభాగం ఎక్స్ అఫీసియో సెక్రటరీ హోదాలో విజయ్ కుమార్ ఈ బాధ్యతలు నిర్వర్తించనున్నారు.