Andhra Pradesh: ఉపాధ్యాయులు విద్యా బోధనకు మాత్రమే!... ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం!
- వర్చువల్ గా భేటీ అయిన ఏపీ కేబినెట్
- ఉపాధ్యాయులను బోధనేతర విధుల నుంచి తప్పిస్తూ నిర్ణయం
- ఆ వెంటనే నోటిఫికేషన్ జారీ చేసిన పాఠశాల విద్యా శాఖ
ఏపీ ప్రభుత్వం మంగళవారం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విద్యా శాఖ పరిధి కింద పనిచేస్తున్న ఉపాధ్యాయులకు బోధనేతర బాధ్యతలను ఇవ్వకూడదని వైసీపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఉపాధ్యాయులను బోధనేతర విధుల నుంచి తప్పిస్తున్నట్లుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిర్ణయంతో ఇకపై ఉపాధ్యాయులు కేవలం విద్యా బోధనకు మాత్రమే పరిమితం కానున్నారు.
మంగళవారం వర్చువల్ గా భేటీ అయిన ఏపీ కేబినెట్ సమావేశం పాఠశాల విద్యా శాఖకు సంబంధించిన ఈ కీలక నిర్ణయానికి ఆమోద ముద్ర వేసింది. కేబినెట్ ఆమోదం లభించిన వెంటనే దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ను పాఠశాల విద్యా శాఖ వెలువరించింది. ఉపాధ్యాయులు బోధనేతర విధులకు నిషిద్ధమని విద్యా హక్కు చట్టం చెబుతున్న విషయాన్ని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రస్తావించింది. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే టీచర్లను బోధనేతర కార్యకలాపాలకు వినియోగిస్తామని ఆ నోటిఫికేషన్ లో ప్రభుత్వం వెల్లడించింది.