Telangana: వైఎస్ వల్లే వందలాది మంది తెలంగాణ విద్యార్థులు అమరులయ్యారు: తెలంగాణ రాష్ట్ర మంత్రి ప్రశాంత్ రెడ్డి

ts minister prashanth reddy viral comments on ys rajasekhar reddy
  • వైఎస్ వల్లే తెలంగాణ రాష్ట్రం ఆలస్యమైందన్న ప్రశాంత్ రెడ్డి
  • తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ ను వీడతానని సోనియాను వైఎస్ బ్లాక్ మెయిల్ చేశారని ఆరోపణ
  • కాంగ్రెస్ పార్టీ వందల మంది బిడ్డల ప్రాణాలను పొట్టనబెట్టుకుందని విమర్శ
వైఎస్సార్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల అరెస్ట్ నేపథ్యంలో హైదరాబాద్ లో పలు నాటకీయ పరిణామాలు చోటుచేసుకోగా... తెలంగాణ ఉద్యమానికి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వల్ల తీరని అన్యాయం జరిగిందని టీఆర్ఎస్ నేత, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి వల్లే తెలంగాణ రాష్ట్రం ఆలస్యమైందని కూడా ఆయన అన్నారు. తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా చేస్తే... తాను కాంగ్రెస్ పార్టీని వీడతానని ఏకంగా సోనియా గాంధీనే రాజశేఖరరెడ్డి బ్లాక్ మెయిల్ చేశారని కూడా ఆయన ఆరోపించారు. ఈ కారణంగా తెలంగాణను ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు చేసేందుకు సోనియా ఒప్పుకున్నా... వైఎస్ బ్లాక్ మెయిల్ రాజకీయాలతో వెనక్కు తగ్గారని ఆయన అన్నారు.

వైఎస్ రాజశేఖరరెడ్డి వల్లే తెలంగాణకు చెందిన వందలాది మంది విద్యార్థులు అమరులు అయ్యారని ప్రశాంత్ రెడ్ది ఆరోపించారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణకు చెందిన వందల మంది బిడ్డలను పొట్టనబెట్టుకుందని కూడా ఆయన మరింత ఘాటు వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ పార్టీ మాట తప్పడంతో నాడు కేంద్ర మంత్రి పదవిని కేసీఆర్ గడ్డిపోచలా వదిలేశారన్నారు. తనతో పాటు ఎమ్మెల్యేలు, రాష్ట్ర మంత్రులతో రాజీనామాలు చేయించిన కేసీఆర్... తిరిగి తెలంగాణ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్నారన్నారు.
Telangana
TRS
V Prashanth Reddy
YS Rajasekhar Reddy
Congress

More Telugu News